https://oktelugu.com/

చలికాలంలో ఎన్నికల వేడి

రాష్ట్రంలో చలి ప్రారంభమైంది. కానీ.. ఇంతటి చలిలోనూ రాష్ట్ర రాజధానిలో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల వేడి రాజుకుంది. మరో వారం రోజుల్లో గ్రేటర్‌‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంత పార్టీలు ఎన్నికల ప్రచారపర్వాన్ని మొదలెట్టేశాయి. నామినేషన్ల పర్వం ముగిసి అభ్యర్థులెవరో కూడా తేలడంతో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరాడుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు హాట్‌హాట్‌గా మారాయి. అధికార టీఆర్‌ఎస్‌ దూకుడును అడ్డుకుంటామన్న ధీమాతో బీజేపీ రంగంలోకి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2020 / 03:44 PM IST
    Follow us on

    రాష్ట్రంలో చలి ప్రారంభమైంది. కానీ.. ఇంతటి చలిలోనూ రాష్ట్ర రాజధానిలో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల వేడి రాజుకుంది. మరో వారం రోజుల్లో గ్రేటర్‌‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంత పార్టీలు ఎన్నికల ప్రచారపర్వాన్ని మొదలెట్టేశాయి. నామినేషన్ల పర్వం ముగిసి అభ్యర్థులెవరో కూడా తేలడంతో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరాడుతున్నాయి.

    దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు హాట్‌హాట్‌గా మారాయి. అధికార టీఆర్‌ఎస్‌ దూకుడును అడ్డుకుంటామన్న ధీమాతో బీజేపీ రంగంలోకి దిగడం, కాంగ్రెస్‌ కూడా తనకు అనుకూలంగా ఉన్న చోట్ల ప్రభావం చూపేందుకు వ్యూహాలు రచిస్తుండటం, తనకు మంచి పట్టున్న స్థానాల్లో ఎంఐఎం ఎప్పటిలాగే దూసుకెళుతుండడం, మిగిలిన రాజకీయ పక్షాలు కూడా అక్కడక్కడా పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో గ్రేటర్‌ పోరు రసవత్తరం కానుంది.

    గ్రేటర్‌‌లో ముఖ్యంగా ప్రధానపార్టీల మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎట్ ద సేమ్‌ టైమ్‌.. ఓటర్లను ఆకట్టుకునేందుకు మాటల తూటాలూ పేల్చుతున్నాయి. వరద బాధితులకు పరిహారం పంపిణీతో మొదలైన ఈ వేడి టీఆర్‌ఎస్‌ సెంచరీ ధీమా, బీజేపీ భాగ్యలక్ష్మి ఆలయం ట్విస్ట్, కాంగ్రెస్‌ ఆరోపణలు, ఎంఐఎం నేతల ఆసక్తికర వ్యాఖ్యల నేపథ్యంలో మరింత రగులుకుంటోంది. తాము గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచినా ఈసారి సెంచరీ కొడతామని, పాతబస్తీలోని 10–12 స్థానాల్లో ఎంఐఎంను కూడా ఓడిస్తామని, విశ్వ నగరం కావాలో, విద్వేష నగరం కావాలో ప్రజలే తేల్చుకోవాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు చేస్తున్నారు.

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సీఎంను సవాల్‌ చేస్తూ కమలనాథుల్లో ఉత్సాహం తెచ్చేందుకు ప్రయత్నిస్తుండటం ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశమవుతోంది. ఈ రెండు పార్టీ లు ఒకటేనని, ఎంఐఎంతో కలిసి ముగ్గురూ డ్రామాలు ఆడుతున్నారని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తామే కనుక తమను ఆదరించాలని కాంగ్రెస్‌ నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

    తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రకటించడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమను గెలిపిస్తే గ్రేటర్‌ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తామనే దానిపై టీఆర్‌ఎస్‌ అన్ని పార్టీల కన్నా ముందే మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. ఈ నెల 24న కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. బీజేపీ కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. మొత్తం మీద జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో రానున్న ఐదు రోజులపాటు రాజకీయ పార్టీల మధ్య మరిన్ని మాటల తూటాలు పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాలు మరింత వేడి పుట్టించే పరిస్థితులే ఉన్నాయి.