https://oktelugu.com/

TS Police: ఆడపిల్ల జుట్టుపట్టి ఈడ్చుకెళ్లి.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా?

రాజేంద్రనగర్ లోని వ్యవసాయ యూనివర్సిటీలో 100 ఎకరాలను రాష్ట్ర హైకోర్టుకు కేటాయిస్తున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 25, 2024 / 09:16 AM IST
    Follow us on

    TS Police: గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని చెప్పింది. కానీ పోలీసులు చాలా విషయాలలో మితిమీరిన జోక్యం చేసుకోవడంతో అప్పటి ప్రభుత్వం తల దించుకోవాల్సి వచ్చింది. మరియమ్మ లాకప్ డెత్, సంగారెడ్డిలో ఓ ముస్లిం వ్యక్తి లాకప్ డెత్.. మల్లన్న సాగర్ ముంపు రైతులపై లాఠీచార్జి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో దారుణాలు . గడిచిన 10 సంవత్సరాలలో అలాంటివి పెరిగిపోవడంతో జనానికి విరక్తి వచ్చి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి శాంతి భద్రతల పరిరక్షణ మీద స్పష్టంగా మాట్లాడారు. హోం శాఖను కూడా తన వద్ద ఉంచుకుంటున్నాను అని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. బుధవారం హైదరాబాదులో జరిగిన ఓ సంఘటన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసింది. సోషల్ మీడియాలో ఆ వీడియో చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వం తలదించుకోవాల్సి వచ్చింది.

    రాజేంద్రనగర్ లోని వ్యవసాయ యూనివర్సిటీలో 100 ఎకరాలను రాష్ట్ర హైకోర్టుకు కేటాయిస్తున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. హైకోర్టు నిర్మాణం జరిగితే అక్కడ జీవవైవిద్యం దెబ్బతింటుందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు కొన్ని రోజులుగా అక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. యూనివర్సిటీని కాపాడేందుకు ఉద్యమాలను ఉదృతం చేస్తామని ప్రకటించారు. యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉద్యాన యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.ఈ ఆందోళనలో ఏబీవీపీ కార్యకర్తలు అయితే నిరసనకారులను చదరగొట్టేందుకు పోలీసులు అతిగా ప్రవర్తించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై తమ ప్రతాపాన్ని చూపారు. అయితే ఇదంతా జరుగుతుండగానే ఇద్దరు మహిళా పోలీసులు చేసిన పని సభ్య సమాజం తల దించుకునేలా చేసింది.

    ఏబీవీపీ కి చెందిన ఓ మహిళా కార్యకర్తను ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు స్కూటీ మీద వెంబడించారు. అంతేకాదు ఆమె జుట్టు పట్టి లాగారు. దీంతో ఆ మహిళా కార్యకర్త కింద పడింది. దీనికి సంబంధించిన వీడియో ను కొంతమంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది చర్చనీయాంశంగా మారింది. మహిళా పోలీసు తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే జుట్టు పట్టి లాగడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆ యువతి కిందపడి గాయపడితే పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన మహిళా కానిస్టేబుళ్ళ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై బిజెపి తీవ్రస్థాయిలో మండిపడింది. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలను జుట్టు పట్టి లాగడమా అని ఎద్దేవా చేసింది. అయితే ఈ సంఘటనపై ఇంతవరకు అధికార పార్టీ స్పందించలేదు.