JanaSena: జనసేనకు గాజు గ్లాస్ గేమ్ చేంజర్ అవుతుందా?

ఏపీలో మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టిడిపి, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. బిజెపి నుంచి ఇంతవరకు స్పష్టత లేదు.

Written By: Dharma, Updated On : January 25, 2024 9:12 am
Follow us on

JanaSena: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేనకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన ఎన్నికల గుర్తును ఖరారు చేసింది. మరోసారి గాజు గ్లాసును కేటాయించింది. ఈ మేరకు మెయిల్ ద్వారా ఎన్నికల సంఘం సమాచారం అందించింది. ఈ ఉత్తర్వుల ప్రతులను జనసేన అధినేత పవన్ కు మంగళగిరి కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రసాద్ అందజేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పై పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

ఏపీలో మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టిడిపి, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. బిజెపి నుంచి ఇంతవరకు స్పష్టత లేదు. తాము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని బిజెపి నేతలు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట జనసేన గుర్తు విషయంలో ఎలక్షన్ కమిషన్ ప్రకటన అయోమయానికి దారితీసింది. గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా గుర్తించడంతో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని వార్తలు వచ్చాయి. జనసేన పోటీ చేసిన చోట ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తూనే.. ఇండిపెండెంట్ లకు సైతం అదే గుర్తును కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ నడిచింది. దీంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేనలో ఒక రకమైన గందరగోళం నెలకొంది.

ఇటువంటి తరుణంలో జనసేన నాయకత్వం ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించింది. జనసేనకు శాశ్వతంగా గాజు గ్లాస్ గుర్తును కేటాయించాలని ఆ పార్టీ లీగల్ సెల్ కోరుతూ వచ్చింది. దీంతో ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. సార్వత్రిక ఎన్నికల వేళ జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు దక్కదని వైసీపీ సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేసింది. అయితే తాజా ఈసీ నిర్ణయంతో జనసేన శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో జనసేన పార్టీ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా జనసేన గుర్తు చుట్టూ కుట్రలు జరిగాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును పోలినట్టు బకెట్ గుర్తుతో ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలో దించారు. దీంతో గాజు గ్లాస్ గుర్తుకు పడాల్సిన ఓట్లు.. బకెట్ గుర్తువైపు వెళ్లాయి. ఏపీ ఎన్నికల్లో సైతం అదే ఫార్ములాను అనుసరించడానికి అధికార పక్షం కసరత్తు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేనకు గాజు గ్లాస్ గుర్తును శాశ్వతంగా ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. ఇది ఒక గేమ్ చేంజ్ గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గుర్తు విషయంలో ఇబ్బంది పెట్టడం ద్వారా జనసేన శ్రేణుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలని అధికార పక్షం భావించింది. కానీ వాటన్నింటినీ తెరదించుతూ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకోవడం జనసైనికుల్లో జోష్ నింపింది. అధికార పక్షానికి మాత్రం నిరాశ మిగిల్చింది.