KTR’s friend: కేటీఆర్ ఫ్రెండ్ ను ఓడించిన ఈ బొజ్జు ఎవరో తెలుసా?

ఖానాపూర్ నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రేఖా నాయక్ ఉండేవారు.. అయితే మంత్రి కేటీఆర్ స్నేహితుడు జాన్సన్ నాయక్ కు ఈ స్థానాన్ని కేటాయించారు. దీంతో అనివార్యంగా రేఖా నాయక్ భారత రాష్ట్ర సమితి అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 4, 2023 3:32 pm
Follow us on

KTR’s friend: అతని పేరు వెడ్మా బొజ్జు. ఉండేది ఆదివాసి జిల్లాగా పేరుపొందిన ఆదిలాబాద్ లోని ఉట్నూరు మండలం కల్లూరు గూడ గ్రామం అతడిది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబం అతడిది. తల్లి తండ్రి కూలినాలి చేసే వారు. దొరకని నాడు పస్తులు ఉండేవారు. తల్లిదండ్రుల కష్టం చూడలేక బొజ్జు పేపర్ బాయ్ గా పని చేసేవాడు. వచ్చిన డబ్బులను తల్లిదండ్రులకు ఇచ్చేవాడు. అయితే అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో బొజ్జు కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. వారు ఇందిరమ్మ ఇంటిలోనే నివాసం ఉండడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బొజ్జు గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోవడం.. ఆ తర్వాత ఆదివాసుల సమస్యల మీద పోరాడుతున్న తుడుం దెబ్బ అనే సంస్థలో చేరడం జరిగిపోయాయి.. తుడుం దెబ్బ కు సలహాదారు స్థాయి వరకు బొజ్జు పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇతర వ్యాపకాలు చూసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మొదట్లో బొజ్జు కాంగ్రెస్ పార్టీలో చేరితే చాలామంది హేళన చేశారు. నువ్వేంటి ఖానాపూర్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తావా అంటూ నవ్వారు. వాటన్నింటినీ కూడా బొజ్జు లైట్ తీసుకున్నాడు.

జాన్సన్ నాయక్ రాకతో..

ఖానాపూర్ నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రేఖా నాయక్ ఉండేవారు.. అయితే మంత్రి కేటీఆర్ స్నేహితుడు జాన్సన్ నాయక్ కు ఈ స్థానాన్ని కేటాయించారు. దీంతో అనివార్యంగా రేఖా నాయక్ భారత రాష్ట్ర సమితి అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఆలస్యం.. మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న ఆమె అల్లుడిని ప్రభుత్వం బదిలీ చేసింది. అంతేకాకుండా రేఖా నాయక్ అనుచరులను వేధింపులకు గురిచేసింది. ఆమె ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ పనులకు బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టింది. అయితే సహజంగా ఇలాంటి విషయాలను బాధిత రేఖా నాయక్ ప్రజల దృష్టికి తీసుకెళ్లగలగాలి. కానీ బొజ్జు ఈ విషయాలను ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లగలిగారు.. అధికార పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తమ సామాజిక వర్గం వారికి అర్థమయ్యేలా చెప్పగలిగారు.

అందువల్లే విజయం సాధ్యమైంది

జాన్సన్ నాయకు లంబాడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ ఖానాపూర్ ప్రాంతంలో గోండు జాతి అధికంగా ఉంటుంది. గతంలో రేఖ నాయక్ భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసినప్పుడు బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఆమె విజయం నల్లేరు మీద నడకయింది. కానీ ఇప్పుడు బొజ్జు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం.. అక్కడ ఆదివాసి సమాజం ఎక్కువగా ఉండటం.. ఈ పరిణామాలతో బొజ్జు విజయం నల్లేరు మీద నడకయింది. భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసిన జాన్సన్ నాయక్ కేటీఆర్ స్నేహితుడు.. అంగ బలం, అర్థబలం అధికంగా ఉన్నప్పటికీ అవి బొజ్జును ఏమి చేయలేకపోయాయి.. పైగా టూరిస్ట్ నేతగా పేరు ఉండడంతో ఇక్కడి ప్రజలు అనివార్యంగా బొజ్జు వైపు మొగ్గు చూపించారు. ఈ నేపథ్యంలో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఏ ప్రభుత్వంలో అయితే తనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో.. అదే ప్రభుత్వంలో నేడు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన పార్టీకి ఖానాపూర్ నియోజకవర్గంలో ఆయన సారథ్యం వహిస్తున్నారు. అంతేకాదు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని ఓడించి తన సత్తా చాటారు.