Rain Warining : విశ్వనగరం హైదరాబాద్ జడివానకు చిగురుటాకులా వనుగుతోంది. పెరుగుతున్న జనాభా, చెరువుల కబ్జాలు, నాళాల ఆక్రమణల కారణంగా చిన్న వర్షం కురిసిన నగరం రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి. కాలువల్లా వరద రోడ్లపై పారుతోంది. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వరద వెళ్లిపోయేలా, ట్రాఫిక్ నిలిచిపోకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నా.. ఏటా సమస్య జఠిలం అవుతోంది. శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడం లేదు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఆకాశానికి చిల్లుపడినట్లుగా కురిసిన భారీ వర్షానికి నగరం జలమయమైంది. కొన్ని నిమిషాల్లోనే రోడ్లు చెరువులుగా మారాయి. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం జలదిగ్బంధం అయింది. గచ్చిబౌలి నుంచి.. కోటి వరకు.. ఇటు మెహదీపట్నం నుంచి ..కూకట్ పల్లి వరకూ పూర్తిగా రోడ్లపై వర్షపు నీరు చేరి చెరువుల్లా మారాయి. ఇక టోలిచౌకి, మణికొండ, నానాక్ రామ్ గూడ ప్రాంతాల్లో పూర్తిగా కాలనీల్లో నీరు చేరడంతో చెరువుల్ని తలపిస్తున్నాయి. పనులు, ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోయారు. మాసబ్ ట్యాంక్ నుంచి పంజాగుట్ట, అమీర్ పేట్, బేగంపేట వెళ్లే మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే చిక్కుకుపోయారు. ఓవైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు వర్షంతో నరకయాతన అనుభవిస్తున్నారు. కాబట్టి వర్షసూచన, ట్రాఫిక్ జామ్ ను దృష్టిలో ఉంచుకొని నగరవాసులు ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
భయపెడుతున్న ఉరుములు..
వర్షం రోజంతా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఉరుములు నగరవాసులను భయపెడుతున్నాయి. మిన్ను విరిగి మీదపడినట్లుగా, తలపై బాంబులు పేలినట్లుగా అనిపిస్తోందని పేర్కొంటున్నారు. సోమవారం ఉదయం నుంచి నగరంలో అనేక చోట్ల కురుస్తున్న వర్షానికి రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మరీ ముఖ్యంగా మెహదీపట్నం నుంచి కోఠి వెళ్లే మార్గంలో.. మాసబ్ ట్యాంక్ నుండి పంజాగుట్ట, అమీర్ పేట నుంచి కూకట్ పల్లి.. అలాగే బేగంపేట నుంచి సికింద్రాబాద్ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని వాతావరణ శాఖ సూచిస్తోంది.
సిటీలో ట్రాఫిక్ అంతరాయం..
ఇక సోమవారం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి జీవీకే మాల్, కేర్ హాస్పిటల్ మీదుగా పంజాగుట్ట చేరుకోవడానికి సుమారు గంటకుపైగా సమయం పడుతోంది. దీంతో గ్రేటర్ మున్సిపల్ అధికారులు నగరవాసుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో రోడ్లపైకి రావద్దని .. బయటకు వచ్చి ట్రాఫిక్ లో చిక్కుకోవడం కంటే ఇంట్లోనే ఉండటం బెటర్ అని సూచిస్తున్నారు.
ఐటీ సెక్టర్ లో ట్రాఫిక్ జామ్..
ఐటీ సెక్టర్ ప్రాంతామైన మణికొండ, గచ్చిబౌలి, నానాక్‌రామ్ గూడ, టోలిచౌకి, రాయదుర్గం, పుప్పల్ గూడ రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. కిలో మీటర్ వాహనం కదలడానికి గంటకుపైగా సమయం పడుతోంది. మరోవైపు ఫిల్మ్ నగర్, కష్ణానగర్ ప్రాంతంలో వర్షపు నీరు కాలనీల్లోని నీరు రోడ్లపైకి చేరి చెరువులను తలపిస్తున్నాయి.