Homeజాతీయ వార్తలుTelangana Congress: టీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా డీకే.. రేవంత్‌కు చెక్‌.. తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు!

Telangana Congress: టీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా డీకే.. రేవంత్‌కు చెక్‌.. తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు!

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్నాళ్లుగా కొనసాగుతున్న అంతర్గత సంక్షోభం పైకి సమసిపోయినట్లు కనిపిస్తున్నా.. లోలోపల రగులుతూనే ఉంది. కాంగ్రెస్‌ అంటేనే కయ్యాల పార్టీ.. రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత ఈ కయ్యాలు ఎక్కువయ్యాయి. సీనియర్లు సహాయ నిరాకరణ ప్రకటించారు. రేవంత్‌ సారథ్యంలో పనిచేయడానికి ఇష్టపడడం లేదు. దీంతో అసలైన కాంగ్రెస్‌ వాదులం అంటూ మరో గ్రూపుగా ఏర్పడ్డారు. రేవంత్‌ను వెనక్కు లాగేందుకు పార్టీకి కూడా నష్టం చేస్తున్నారు.

కర్ణాటక ఫలితాల తర్వాత..
కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణపైన ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో బీజేపీ బలం పెరగకూడదని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీ దారు తామేనని భావిస్తోంది. ఈ సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. కర్ణాటక విజయంతో పార్టీలో విభేదాలు సమసిపోయినట్లు కనిపిస్తున్నా.. అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతన్నట్లు గుర్తించింది. దీంతో కర్ణాటక తరహాలో అంత కలిసి పనిచేసేలా చూడాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్టీలోని సీనియర్లకు సన్నిహితుడైన ప్రస్తుత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను తెలంగాణ ఇన్‌చార్జిగా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ట్రబుల్‌ షూటర్‌గా డీకేకే గుర్తింపు..
ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే. శివకుమార్‌కు ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు ఉంది. కష్టాల్లో పార్టీని గట్టెక్కించగల సమర్థుడుగా అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణపై ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా డీకేను తెలంగాణలో దించాలని భావిస్తోంది. సీనియర్లతో డీకేకు మంచి సంబంధాలు ఉన్నందున ఆయన అంతర్గత సంక్షోభానికి తెరదించుతారని అధిష్టానం భావిస్తోంది.

రేవంత్‌ వ్యతిరేక వర్గాన్ని సమన్వయ పరిచేలా..
రేవంత్‌ నాయకత్వాన్ని సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల వీరు కర్ణాటకకు వెళ్లి డీకేను కలిశారు. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ వీరికి బాధ్యతలు అప్పగించారు. దీంతో డీకేతో సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలో సీనియర్లు డీకేను తెలంగాణ ఇన్‌చార్జిగా తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంబించారు. ఈమేరకు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ప్రారంభించారు. ఈ ప్రదిపాదనను అధిష్టానం కాదనే నమ్మకం సీనియర్లలో వ్యక్తమవుతోంది.

ఇప్పటికే డీకే సలహాలు..
కర్ణాటక విజయంతో తెలంగాణలో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. ఈ క్రమంలో డీకే సూచనలు కూడా స్వీకరిస్తోంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇటీవల కర్ణాటకకు వెళ్లి సలహాలు సూచనలు స్వీకరించారు. అంతర్గత సమస్యలు సమసిపోయేలా ఏం చేయాలనే ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో పలువురు సీనియర్లు కూడా డీకేతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

సమన్వయం..వ్యూహాలు..
డీకే శివకుమార్‌ నియామకం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని కాంగ్రెస్‌ అధిష్టానం అంచనా వేస్తోంది. పార్టీలో సీనియర్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. పార్టీ వేగంగా ముందుకు వెళుతున్న ప్రతిసారీ ఈ అంతర్గత విభేదాలతో తలనొప్పులు ఎదురవుతున్నాయి. మరోపక్క ఇతర పార్టీలకు చెందిన సీనియర్‌ నేతల చేరికల విషయంలో కూడా తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. సోనియా, రాహుల్, ప్రియాంకలతో డీకేకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఇక్కడి పార్టీ వ్యవహారాలను ఆయన స్వతంత్రంగా, సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular