BJP : దేశంలో బీజేపీ ఎవరితో పెట్టుకోవాలనుకున్నా వారికి నష్టం.. బీజేపీతో ఎవరు పొత్తులు పెట్టుకోవాలనుకున్నా వారికే నష్టం. ఈ నష్టాన్ని భరించి .. పార్టీని కాపాడుకునే చాకచక్యం ఉన్న వారు సర్వైవ్ అయిపోతారు. లేదంటే.. శినసేన పార్టీలా కుయ్యో.. మొర్రో అంటూ ఉండాలి. నేషనల్ డెమెక్రాటిక్ అలయెన్స్‌లో కొత్త పార్టీల కోసం.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కొత్తగా ప్రణాళికలు వేసుకుంటున్న సమయంలో పాత మిత్రులందర్నీ మళ్లీ దగ్గర తీసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ, అకాలీదళ్, జేడీఎస్ ఇప్పటికే బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
BJP : బీజేపీతో పెట్టుకుంటే.. ఎవరి అవసరం వారిది మరీ!
ఒకసారి విడిపోయాక..
సిద్ధాంతాలు నచ్చక.. పొత్తు సూత్రం తాప్పరన్న కోసంతో ఒకసారి విడిపోయాక మళ్లీ కలవడం కష్టం. కానీ రాజకీయాల్లో అలాంటివి ఉండవు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లుగా గతంలో బీజేపీతో విభేదించి వెళ్లిపోయన వారు మళ్లీ దగ్గరవుతున్నారు. కొంతమందిని బీజేపీ స్వయంగా ఆహ్వానిస్తోంది. మరికొంతమది తమకు తాముగా బీజేపీకి దగ్గరవుతున్నారు.
ఎవరి అవసరం వారిది..
ఇప్పుడు కొన్ని పార్టీలు .. వివిధ కారణాలతో బీజేపీతో పొత్తు అవసరం అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ స్నేహ హస్తం ఇస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ కూడా వచ్చే ఎన్నికల నాటికి కొన్ని పార్టీల అవసరం తమకు ఉందని భావిస్తోంది. ఈ క్రమంలో తమకు అవసరం అనుకుంటున్న పార్టీలను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తోంది. అందుకే ఇప్పుడు కొత్తగా మిత్రుల కోసం వేట ప్రారంభించింది. ఎంత వరకూ ఈ వేట సాగుతుంది.. ఎన్ని పార్టీల్ని బుట్టలో వేస్తుంది.. ఎన్ని పార్టీలు ఎన్డీఏలో చేరుతాయి.. అంతిమంగా అలా చేరిన పార్టీలు ఎన్ని సే‹ గా .. ఉనికి కాపాడుకుంటాయన్నది మాత్రం.. ఇప్పుడిప్పుడే చెప్పలేం.
నాడు వేరు.. నేడు వేరు..
ఎన్డీఏ.. వాజ్‌పేయి హయాంలో వెలుగు వెలిగిన కూటమి. ఈ కూటమే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తోంది. కానీ ఎప్పుడూ అలా చెప్పుకోవడం లేదు. కనీసం బీజేపీ ప్రభుత్వం అని కూడా చెప్పుకోవడం లేదు. కేవలం నరేంద్రమోదీ ప్రభుత్వం అని చెప్పుకుంటారు. దేశంలో తిరుగులేని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభ క్రమంగా మసకబారిపోయిన తర్వాత సంకీర్ణ రాజకీయాల శకం వచ్చింది. 90ల్లో కూటముల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ఏర్పాటయ్యాయి. నడుస్తోంది సంకీర్ణ ప్రభుత్వమే కానీ.. బీజేపీకి గత రెండు విడతలుగా సంపూర్ణ మెజార్టీ రావడంతో ఇతర పార్టీల పేర్లు వినిపించవు, కనిపించవు. ఎందుకంటే.. ఇప్పడు ఉన్నవన్నీ కూటమిలో ఉనికి లేని పార్టీలే. బలమైన పార్టీలన్నింటినీ బీజేపీ నిర్వీర్యం చేయడమో.. నిర్వీర్యం చేస్తారని భయపడి బయటకు వెళ్లిపోవడమో జరిగాయి. అందుకే ఎన్డీఏలో పార్టీల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.
నాడు బలమైన పార్టీలు.. నేడు బలహీనంగా..
ఒకప్పుడు ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఆ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పార్టీలు ఎన్డీఏలో ఉండేవి. పంజాబ్‌లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన, అన్నాడీఎంకే, లోక్ జనశక్తి , 2014లో టీడీపీ కూడా ఉండేది. అయితే ఇప్పుడు బీజేపీతో జట్టులో ఉన్న ఇతర పార్టీలు ఏవీ ఆ పార్టీతో సుదీర్ఘంగా నడుస్తున్నవి కావు. బలం ఉన్నవి కావు. ప్రస్తతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఉన్న పార్టీ ఏది అంటే.. శివసేన చీలిక గ్రూపు మాత్రమే. పన్నెండు మంది శివసేన ఎంపీలు విడిగా ఏర్పడి ఎన్డీఏలో భాగమయ్యారు. దాదాపుగా పాతికేళ్లపాటు బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న శివసేన ఇప్పుడు బీజేపీ ధాటికి కకావికలం అయిపోయింది. ఉనికి సమస్యలో పడింది. శివసేన మాత్రమే కాదు.. అకాలీదళ్‌దీ అదే పరిస్థితి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. కానీ ఆ పార్టీ మెరుగుపడలేదు. అన్నాడీఎంకే కూడా బీజేపీ రాజకీయ చదరంగంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఇక రాంవిలాస్ పాశ్వాన్ చనిపోయాక.. ఆయన పార్టీ లోక్ జనశక్తి చిన్నాభిన్నమైంది. ఆయన కుమారుడ్ని.. బాబాయ్‌ను విడదీసి.. బాబాయ్‌ను బీజేపీ అక్కున చేర్చుకుంది. ఇప్పుడా పార్టీకి ఉనికి కష్టంగామారింది. తాజాగా జేడీయూ పరిస్థితి కూడా అదే. బీహార్‌లో జేడీయూ ఒకప్పుడు మేజర్ పార్టీ. బీజేపీ పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు తీసుకునేది. ఇప్పుడు జేడీయూ అల్ప స్థానానికి పడిపోయింది. చివరికి .. అసలు పార్టీని మోదీ, షాలు మింగేస్తారని తెలిసి.. కూటమికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ , జేడీయూతో కలిసింది. విడిపోయినా ఆ పార్టీకి బీజేపీ నుంచి ముప్పు ఉండనే ఉంటుంది.
వ్యతిరేక కూటమి బలపడుతుండడంతో..
2024 లోక్‌సభ ఎన్నికలలోపు బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేసుకోవాలని విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. వ్యతిరేక కూటమి బలపడుతున్న నేపథ్యంలో ఎన్‌డీఏను బలపర్చేందుకు బీజేపీ కొత్త పొత్తులు కోరుకుంటోంది. బీజేపీకి ప్రస్తుతం పూర్తి మెజార్టీ ఉంది. కానీ రాజకీయాల్లో ఎల్లప్పుడూ ఒకేరకమైన బలం ఉండదని అందరికీ తెలుసు. ఒక వేళ తమకు ఊహించని బలం వస్తుందని అధికారంలో ఉన్న వారు అనుకుంటే అది అహంకారమే అవుతుంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్నారు. అందుకే వచ్చే ఎన్నికల నాటి పరిస్థితుల్ని గుర్తించి.. మిత్రపక్షాలతో తమ బలగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.