DJ Noise Pollution : ఒకప్పుడు చావైనా.. పెళ్లయినా.. మరే వేడుకైనా సరే డప్పు చప్పుళ్ళు ఉండేవి. అవి చెవులకు వినసొంపుగా ఉండేవి. కళాకారులు లయబద్ధంగా డప్పులు కొడుతుంటే ఊపు వచ్చేది. ముసలి వాళ్లు కూడా కాళ్లు కదిపేవారు. ఇక యువకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అలాంటి సంస్కృతి మనదేశంలో ప్రతి గ్రామంలో ఉండేది. వేడుకల సమయంలో.. ఇతర విషాదాలు చోటు చేసుకున్నప్పుడు కచ్చితంగా డప్పు చప్పుళ్ళు ఉండేవి. సందర్భానికి తగ్గట్టుగా కళాకారులు డప్పులను వాయించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు పబ్బు.. క్లబ్బులకు మాత్రమే పరిమితమైన డీజే మారుమూల గ్రామాలకు వచ్చేసింది. దీంతో డప్పులు కొట్టే కళాకారులకు ఉపాధి లేకుండా పోయింది. డీజే వల్ల శబ్దం తీవ్రత పెరిగింది. వేడుకతో సంబంధం లేకుండా డీజేలు ఉపయోగించడం పరిపాటిగా మారిపోయింది. వీటి శబ్దం వల్ల చెవులు హోరెత్తిపోతున్నాయి. అంతేకాదు కొన్ని సందర్భాలలో కొంతమంది గుండెపోటు మరణాలకు కూడా కారణమవుతున్నారు.
2018లో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ వివాహ వేడుకలో డీజే ఉపయోగించారు. ఆ శబ్దం తీవ్రతకు పెళ్ళి కుమార్తె గుండెపోటుకు గురై అక్కడికక్కడే కన్ను మూసింది. శబ్దం తీవ్రత వల్ల ఆమె హృదయ స్పందన ఒక్కసారిగా ఆగిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు. చివరికి ప్రభుత్వం డీజే పై నిషేధం విధించినప్పటికీ.. ఉపయోగిస్తూనే ఉన్నారు.
డీజే శబ్దం తీవ్రత ఎంత అధికంగా ఉంటుందో చెప్పే సంఘటన ఇది. డిజె సౌండ్ వల్ల మెడికల్ షాప్ లో మందు డబ్బాలు వాటంతట అవే కింద పడిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వివాహ వేడుకలో డీజేను ఏర్పాటు చేశారు. వాటి వల్ల విపరీతంగా శబ్దాలు వచ్చాయి. ఆ షాపు ఓనర్ నిర్వాహకులతో అనేక సందర్భాలలో చెప్పినప్పటికీ.. తీవ్రంగా హెచ్చరించినప్పటికీ.. కాళ్లు పట్టుకొని ప్రాధే పడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అతడు అలానే ఉండిపోయాడు. కానీ ఆ నిర్వాహకులు మాత్రం అలానే సౌండ్ పెట్టుకొని పిచ్చిపిచ్చిగా డాన్సులు వేశారు. ఆ సౌండ్ తీవ్రత వల్ల షాప్ లో ఉన్న వస్తువుల కింద పడిపోయాయి. అయితే డీజే వల్ల సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందని.. కొన్ని సందర్భాలలో గుండెపోట్ల వంటివి కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.