https://oktelugu.com/

Diversion Poltics: డైవర్షన్ పాలిటిక్స్.. రోజుకో ఇష్యూతో తెలంగాణ రాజకీయాలు..అసలేం జరుగుతోంది?

తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అసలు సమస్యలు పక్కన పెట్టి కొసరు సమస్యలను తెరపైకి తెస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రోజుకో సమస్యను సెన్షేషన్ చేస్తూ తామంటే, తామంటూ పోరాటం చేస్తున్నారు.

Written By:
  • Mahi
  • , Updated On : November 16, 2024 / 06:25 PM IST

    Diversion Poltics

    Follow us on

    Diversion Poltics : తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? అధికార, విపక్ష పార్టీలు అసలు సమస్యలు పక్కన పెట్టి కొసరు సమస్యలను తెరరపైకి తెస్తున్నాయా.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు. అసలు రాష్ర్టంలో పాలనతో పాటు చాలా అంశాలు మరుగునపడ్డాయనే టాక్ నడుస్తున్నది. వర్షాలు, రుణమాఫీ నుంచి మొదలైన ఈ పాలిటిక్స్ తాజాగా మూసీ, లగచర్ల ఘటనల వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. గత ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట ప్రజల్లోకి వెళ్లింది. అధికారంలోకి వస్తే ఫామ్ హౌస్ పాలన కాకుండా సచివాలయం నుంచి కొనసాగిస్తామని చెప్పుకొచ్చింది. ఇక గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పైఈ హామీలు ఎంతో పని చేశాయి. సీఎం రేవంత్ దూకుడు కూడా ఇందుకు కలిసివచ్చింది. తెలంగాణ ఇచ్చిన ప్రజల్లో ఉన్న కొంత పాజిటివ్ పాయింట్ ను పట్టుకొని ముందుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది. కానీ అక్కడే ఇబ్బందులు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలులో పూర్తిస్థాయిలో విఫలమైంది. ఒక్క మహిళలకు ఆర్టీసీప్రయాణం మినహా గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను పూర్తిస్థాయి లో అమలు చేయలేకపోయింది. ఇక రైతు భరోసా అటకెక్కింది. ఇక రూ. 2 లక్షలలోపు రుణమాఫీ కూడా అందరికీ చేయలేకపోయింది. దీనిపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నా అనుకున్న స్థాయిలో ప్రజల్లో కి వెళ్లలేకపోతున్నది. ఎందుకంటే రోజుకో ఇష్యూను తెరపైకితేవడం, కొన్నాళ్లకు చల్లార్చడం కామన్ గా మారింది. ఇక ఇందులో కొన్ని ఇష్యూలు చూద్దాం..

    వర్షాలు అధిక వర్షాల కారణంగా ఇబ్బంది పడిన ప్రజలు, రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించింది. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. అయితే వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నిన్న మొన్నటివరకు సీఎంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదంటూ అధికార పార్టీ ఇరుకున పెట్టింది. దీని తర్వాత నిరుద్యోగుల అంశం తెరపైకి వచ్చింది. అశోక్ నగర్ లో నిరుద్యోగులు వివిధ పోటీ పరీక్షల విషయంలో పోరాటానికి దిగారు. కొన్ని రోజుల పాటు ఈఆందోళనలను బీఆర్ఎస్ హైప్ చేసుకుంది. ఇక హైడ్రా, మూసీ సుందరీకరణ అంశంలో నూ బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. బాధితులకు అండగా ఉంటామంటూ కీలక నేతలు కేటీఆర్,హరీశ్ రావు రంగంలోకి దిగారు. ఆ తర్వాత కొంత తగ్గారు. గతంలో మల్లన్నసాగర్ నిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుకూడా తెరపైకి వచ్చింది.

    ఇక తాజాగా లగచర్ల ఘటనలోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నది. కలెక్టర్ తోపాటు ఇతర అధికారులపై దాడి జరిగిన నేపథ్యంలో రైతుల అరెస్టుపై పోరాటానికి దిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ స్పందన సరిగా లేదంటూ పలు ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దాడి జరిగింది అధికారులపై అని, దీనికి బీఆర్ఎస్ మద్దతునిస్తున్నదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా రైతులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ నేతలు మాత్రం చెబుతున్నారు. అసలు ఈ ఘటనకు కారణమే బీఆర్ఎస్ అ ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఈక్రమంలో మాజీ ఎమ్మల్యే నరేందర్ రెడ్డి ని అరెస్టు చేసింది. దీనిపై కూడా బీఆర్ఎస్ ఇప్పుడు పోరాటానికి సిద్ధమవుతున్నది.

    ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి అంటూ పలు అంశాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ అంశాలు తేలింది మాత్రం ఏం లేదు. ముందుగా మీడియాకు ఇదిగో అరెస్టులు.. అదిగో అరెస్టులు అంటూ లీకులివ్వడం తర్వాత చల్లబడడం కామన్ గా మారిందని పలువురు గొణుక్కుంటున్నారు. ఏదేమైనా ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలను పక్కన పెట్టి, కొసరు సమస్యలను అధికార, విపక్ష పార్టీలు ముందు వేసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. కేవలం వ్యక్తిగత రాజకీయాలకు మాత్రమే రెండు పార్టీలు పరిమితమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.