Telugu Politics: ఉమ్మడి రాష్ర్టంలో రాజకీయాలు చాలా హుందాగా కొనసాగేవి. అధికార, విపక్షాలు ఎత్తుకుపైశ్ఎత్తులు వేసుకున్నా కలిసినప్పుడు మాత్రం హుందాగా ప్రవర్తించారు. ముఖ్యంగా వైఎస్, చంద్రబాబు లాంటి నేతలను రాజకీయ నేతలు ఉదహరిస్తున్నారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమే. కానీ నేటి రోజుల్లో అదంతా కానరావడం లేదు. ఇటీవల ఇదే అంశాన్ని రాజకీయాల్లో సీనియర్, మాజీ ఉపరాష్ర్టపతి అయిన వెంకయ్యనాయకుడు ప్రస్తావించారు. రాజకీయాల్లో విలువలు లేకుండా పోయాయని, అధికారంలోకి వచ్చిన నాయకుడు ఎదుటి వాడిని అణిచివేయాలని విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అధికారంలో తాము మాత్రమే ఉండాలనే యావ పెరిగిపోయిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు చాలా కారణాలను, ఉదాహరణాలను వివరిస్తున్నారు. రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరింత అతి పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే నిజమైతే అధికారం కోల్పోయిన వారికి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
తెలంగాణ వరకు చూసుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రతిపక్షాలను కొంత మేర ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేసింది. ఆయనపై వ్యక్తిగత రాజకీయాలు చేసిందని చాలా మంది రేవంత్ రెడ్డి అభిమానులు వాపోతుంటారు. ఇది మాత్రమే రేవంత్ రెడ్డిని మరింత ఎదిగేందుకు దోహదం చేసిందని చెబుతున్నారు. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీ అర్వింద్ విషయంలోనూ బీఆర్ ఎస్ ఇదే రీతిలో ప్రవర్తించింది. ఇప్పుడు ఇందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించుకుంది. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకుంటే అధికార బీఆర్ ఎస్ ఎలా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం తామేం తక్కువ తినలేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నది. బీఆర్ ఎస్ నేతలే టార్గెట్ గా ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నది. ఎప్పడెప్పుడు ఎవరిని అరెస్ట్ చేద్దామా అన్నట్లుగా నే పరిస్థితి ఉంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కేసులు బీఆర్ ఎస్ నేతలపై నమోదవుతున్నాయి.
ఇక ఏపీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత జగన్ సర్కారు టీడీపీ నేతల విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరించారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రతిపక్షాల విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించడ అరుదు. ఆయన కొంత హుందా రాజకీయాలు చేసేవారని పేరుంది. ఇక జగన్ అలాంటి రాజకీయలకు చెక్ పెట్టారు. వ్యక్తిగతంగా చంద్రబాబు మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారు. తన చేతిలో అధికారం ఉందని వివిధ కేసులు నమోదు చేసి, ఏసీబీ ద్వారా జైలుకు పంపించారు. టీడీపీ నేతల పై కూడా ఇదే రీతిలో ప్రవర్తించారు. ఇక వైసీపీ నేతలు టీడీపీ కి చెందిన మహిళ నేతలపై అత్యంత దారుణంగా మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఇలాంటి పరిస్థితులే జగన్ ఓటమికి ఓ కారణమయ్యాయి. ఆయన పథకాల ద్వారా ఎంత దగ్గరయినా. ఇలాంటి చేతల ద్వారా మరింత దూరమయ్యారు. మాజీ స్పీకర్ కోడెల విషయంలో, చంద్రబాబు కుటుంబ సభ్యుల విషయంలో వారి తీరు అత్యంత దారుణంగా ఉంది. ప్రస్తుతం కూడా చంద్రబాబు ముఖం చూడలేనని పంతం పట్టినట్లుగానే జగన్ రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు సీఎం గా చంద్రబాబు ఉన్న నేపథ్యంలోతాను అసెంబ్లీకి రానని పంతం పట్టారు. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి. గతంలో ఇలాంటి రాజకీయాలు చూడలేదని సీనియర్లు చెబుతున్నారు.
ఏదేమైనా ఇలాంటి రాజకీయాలు సమాజానికి మేలు చేసేవి కావని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకుల మధ్య కేవలం రాజకీయ వైరం మాత్రమే ఉండాలని , వ్యక్తిగత, కక్షపూరిత రాజకీయాలకు తావు ఉండొద్దని చెబుతున్నారు. తమిళనాడులో కూడా ఇలాంటి వ్యక్తిగత రాజకీయాలు కొన్నాళ్లు సాగాయి. అయితే ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో కూడా దాదాపు అలాంటి పరిస్థితే ఉందని రాజకీయాల్లో సీనియర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి రానున్న రోజుల్లో మరెన్నీ నీచమైన మాటలు, చేతలు ఈ రాజకీయాల్లో చూడాల్సి వస్తుందో అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.