Khairatabad MLA Danam Nagender : పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది రోజులే గడువున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో రోజుకొక సంచలనం నమోదవుతోంది. ఇప్పటికే చాలామంది భారత రాష్ట్ర సమితి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరి కొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన భారత రాష్ట్ర సమితి కీలక నాయకులలో దానం నాగేందర్ ఒకరు. ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన రేవంత్ సమక్షంలో మూడు రంగుల కండువా కప్పుకున్నారు.. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయనకు ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా 2023 ఎన్నికల్లో దానం నాగేందర్ విజయం సాధించారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ రాజు యాదవ్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. భారత రాష్ట్ర సమితి బీ ఫామ్ మీద గెలిచిన దానం నాగేందర్ .. కాంగ్రెస్ పార్టీలో చేరారని.. ఆయనపై అనర్హత విధించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఇటీవల దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
“దానం నాగేందర్ బీఅర్ఎస్ బీ ఫామ్ మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తే విజయం సాధించారు. మీరు చెప్పినట్టుగా ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇది ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమని మీరు మీ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయంలో దానం నాగేందర్ పై అనర్హత విధించాలని శాసనసభ స్పీకర్ కు మేము ఆదేశాలు జారీ చేయలేం. బీ ఫామ్ ఇచ్చింది భారత రాష్ట్ర సమితి. అలాంటప్పుడు ఆ పార్టీకి అభ్యంతరం ఉండాలి. కేవలం నియోజకవర్గం లో ఓటరుగా ఉన్న మీరు.. ఎమ్మెల్యే పై అనర్హత విధించాలని పిటిషన్ దాఖలు చేయడం ఏంటని” హైకోర్టు వ్యాఖ్యానించింది. దానం నాగేందర్ అనర్హతపై మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారని.. కోర్టు మందలించింది. కాగా, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని.. ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో నాగేందర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు, ఉద్యమాలు చేపట్టారు. కానీ ఇప్పుడు అతనే వారికి నాయకుడు కావడంతో.. వారు అంతర్మథనం చెందుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న రాజు యాదవ్ ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు తీర్పు అతనికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. దానం నాగేందర్ పై కాంగ్రెస్ కార్యకర్తలను ఆగ్రహం ఈ పిటిషన్ ద్వారా వ్యక్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు