HomeతెలంగాణModi And Trump: మోదీ–ట్రంప్‌ మధ్య నోబెల్‌ చిచ్చు.. న్యూయార్క్‌టైమ్స్‌ సంచలన కథనం

Modi And Trump: మోదీ–ట్రంప్‌ మధ్య నోబెల్‌ చిచ్చు.. న్యూయార్క్‌టైమ్స్‌ సంచలన కథనం

Modi And Trump: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌.. ఐదు రోజులక ముగిసింది. భారత్‌ దాడితో తీవ్రంగా దెబ్బతిన్న పాకిస్తాన్‌ డీజీఎంవో ద్వారా యుద్ధం ఆపాలని వేడుకుంది. దీంతో భారత్‌ కూడా సానుకూలంగా స్పందించింది. సీజ్‌ఫైర్‌ కుదిరింది. కానీ, ఈ క్రెడిట్‌ తన ఖాతాలో వేసుకుని నోబెల్‌ శాంతి బహుమతి పొందాలని అమెరికా అద్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భావించారు. ఈ క్రమంలోనే భారత్‌–పాకిస్తాన్‌ సీజ్‌ఫైర్‌కు తానే కారణమని పదేపదే చెప్పుకున్నారు. వాణిజ్య ఒత్తిడి ద్వారా రెండు దేశాలను ఒప్పించానని పదేపదే ప్రకటించారు. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ వాదనను తీవ్రంగా ఖండించారు. జూన్‌ 17న ట్రంప్‌తో జరిగిన ఫోన్‌ సంభాషణలో, సీజ్‌ఫైర్‌ భారత్‌–పాక్‌ సైనికుల మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితమని, అమెరికా జోక్యం లేదని మోదీ స్పష్టం చేశారు. ఇదే ట్రంప్‌కు కోపం తెప్పించింది.

Also Read: టీ బీజేపీలో కలహాలు.. రామచందర్‌రావు గుర్తించట్లేదా?

నోబెల్‌ శాంతి బహుమతికి బ్రేక్‌?
ట్రంప్‌ తన ఫోన్‌ సంభాషణలో, సీజ్‌ఫైర్‌ను సాధించినందుకు పాకిస్తాన్‌ తనను నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేయబోతుందని, మోదీ కూడా అలా చేయాలని సూచించారు. మోదీ ఈ సూచనను తిరస్కరించడం, అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఖండించడం ట్రంప్‌కు కోపం తెప్పించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిక తెలిపింది. భారత్‌లో కాశ్మీర్‌ విషయంలో మూడో దేశం జోక్యాన్ని ఎప్పటికీ అంగీకరించబోమని, ఈ విషయంలో దేశంలో పూర్తి రాజకీయ ఐక్యత ఉందని మోదీ స్పష్టం చేశారు. ఈ సంఘటన ఇరు నాయకుల మధ్య వ్యక్తిగత, దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసింది.

ట్రంప్‌ ప్రతీకార సుంకాలు..
జూన్‌ 17 ఫోన్‌ కాల్‌ తర్వాత, ట్రంప్‌ భారత ఉత్పత్తులపై 25% రెసిప్రొకల్‌ టారిఫ్‌ను విధించారు. అదనంగా, భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25% టారిఫ్‌ను జోడించారు, మొత్తం 50% టారిఫ్‌ భారత్‌పై పడింది. ఈ టారిఫ్‌లు కేవలం వాణిజ్య లోటు సమస్యలకు పరిష్కారం కాకుండా, మోదీ ట్రంప్‌ వాదనలను తిరస్కరించడంపై ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. కాశ్మీర్‌ సమస్య భారత్‌కు అత్యంత సున్నితమైన అంశం. భారత్‌ ఎల్లప్పుడూ ఈ విషయంలో మూడో దేశం జోక్యాన్ని వ్యతిరేకిస్తుంది. ట్రంప్‌ కాశ్మీర్‌పై చర్చలకు మధ్యవర్తిత్వం వహించాలని ప్రతిపాదించడం, భారత్‌–పాకిస్తాన్‌ను సమానంగా చూడడం భారత్‌లో అసంతృప్తిని కలిగించింది. మోదీ బలమైన రాజకీయ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి, ట్రంప్‌ వాదనలను ఖండించారు.

మోదీ–ట్రంప్‌ మధ్య ఈ వివాదం భారత్‌–అమెరికా సంబంధాలను ఒక మలుపు తిప్పింది. గతంలో ట్రంప్‌ మొదటి పరిపాలనలో ఇరు నాయకుల మధ్య సన్నిహిత సంబంధం ఉండేది. అయితే, సీజ్‌ఫైర్‌ వివాదం, నోబెల్‌ బహుమతి సూచన, టారిఫ్‌ విధానాలు ఈ సంబంధాన్ని దెబ్బతీశాయి. ట్రంప్‌ పాకిస్తాన్‌ సైన్యాధిపతి ఆసిమ్‌ మునీర్‌ను వైట్‌ హౌస్‌లో ఆహ్వానించడం, పాకిస్తాన్‌తో చమురు అన్వేషణ ఒప్పందం కుదుర్చుకోవడం భారత్‌లో మరింత అసంతృప్తిని కలిగించాయి. ఈ పరిణామాలు భారత్‌ను చైనా, రష్యా వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా నడిపిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular