Hyderabad real estate: హైడ్రాతో ఢమాల్.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను రేవంత్ సర్కార్ ఎలా నిలబెడుతుంది?

గత నాలుగైదు నెలల క్రితం ఏర్పాటైన హైడ్రాతో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పుడు కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది.

Written By: Srinivas, Updated On : October 22, 2024 4:57 pm

Real-estate-hyd

Follow us on

Hyderabad real estate: గత నాలుగైదు నెలల క్రితం ఏర్పాటైన హైడ్రాతో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పుడు కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. దాంతో రియల్ వ్యాపారం కాస్త ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్‌ను కాపాడేందుకు ప్రధానంగా హైడ్రాను తీసుకువచ్చారు. అక్రమ కట్టడాలను కూల్చడమే ప్రధాన లక్ష్యంతో ఈ వ్యవస్థ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాల కోసం హైడ్రాను తీసుకొచ్చినట్లు పదే పదే చెప్తూనే ఉన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేయడం వల్ల భవిష్యత్తులో మహానగరాన్ని వరదల బారి నుంచి కాపాడుకోవచ్చని రేవంత్ ఆలోచనగా చెప్పుకొచ్చారు. ఎవరు అడ్డొచ్చినా హైడ్రా పని ఆగేది లేదని కూడా స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ లక్ష్యం దిశగా సాగుతామని వెల్లడించారు.

హైడ్రా ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఎలాంటి విరుద్ధమైన పనులు అయితే చేపట్టలేదు. అన్ని అనుమతులు ఉన్న బిల్డింగుల జోలికి పోలేదు. కేవలం ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన వాటినే కూల్చివేస్తూ వచ్చారు. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఇప్పటివరకు అలాంటి అక్రమ కట్టడాలను వందల సంఖ్యలో హైడ్రా కూల్చివేసింది. చాలా ఇళ్లకు నోటీసులు సైతం జారీ చేసింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న అక్రమ కట్టడాల పని పడుతున్నది హైడ్రా. ముఖ్యమంత్రి రేవంత్ సూచనలు పాటిస్తూ కూల్చివేస్తూ ముందుకు వెళ్తోంది. కానీ.. హైడ్రాపై జరుగుతున్న ప్రచారం అందుకు భిన్నంగా ఉంది. హైడ్రా వల్ల ప్రజలు ఆస్తులు కోల్పోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇళ్లను కూల్చివేసిన వద్దకు వెళ్లి ఆందోళనలకు దిగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రజలు కూడా ఆస్తులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంలేదు. ఆస్తులు కొనుగోలు చేసేందుకు వెనకాముందు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కొత్తగా వెంచర్లు వేయలేకపోయారు. కొత్తకొత్త అపార్ట్‌మెంట్లు కూడా నిర్మించలేకపోయారు.

ఇదిలా ఉంటే.. రియల్ ఎస్టేట్ మరింత కుదేలు కాకుండా కాపాడేందుకు హైడ్రా చర్యలకు దిగింది. వ్యాపార వర్గాల్లో ఉన్న సందేహాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేశారు. అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చివేయబోమని స్పష్టత ఇచ్చారు. అలాగే. చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన వెంచర్ల జోలికి కూడా పోయేది లేదని తేల్చిచెప్పారు. అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన వెంచర్ల యజమానులు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉంటామని కమిషనర్ రంగనాథ్ భరోసా ఇచ్చారు. అటు చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలను కూల్చబోమని తెలిపారు. ఎట్టకేలకు హైడ్రా ఓ క్లారిటీ ఇవ్వడంతో రియల్ వ్యాపారుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న వ్యాపారం అంతా మరోసారి ఊపందుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అటు ప్రజల్లోనూ ఉన్న అనుమానాలు తొలగిపోవడంతో.. కొనుగోళ్లకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.