చెల్లని ఓట్లతో గందరగోళం
మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపు సాధ్యమేనా.?
ఆందోళనలో ప్రధాన అభ్యర్థులు
Telangana MLC Elections Counting: కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆసక్తిగా మారింది. రెండు రోజుల్లో పూర్తవుతుందనుకున్న ఈ కౌంటింగ్ ప్రక్రియ మూడు, నాలుగు రోజులు కూడా పట్టవచ్చనే అభిప్రాయం నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహిస్తున్న ఈ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేశారు.
Also Read: సర్ ప్రైజ్ : తీన్మార్ మల్లన్న బ్యాచ్ బీఆర్ఎస్ భజన చేస్తోందేంటి?
మొదటి రోజు సాయంత్రం ఉపాధ్యాయుల ఎమ్మేల్సీ కౌంటింగ్ కేవలం 25 వేల పైచిలుకు ఓట్లు కావడంతో విజయవంతంగా పూర్తి చేసిన అధికార యంత్రాంగం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కు మాత్రం ఎక్కువ సమయం తీసుకోవాల్సివస్తోంది. 2.50 లక్షల ఓట్లను లెక్కించడం ఒక ఎత్తైతే, వాటిలో చెల్లని ఓట్లను వేరు చేసేందుకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. 24 వేల పైచిలుకు ఓట్లు చెల్లకుండా పోవడంతో అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమైంది. చెల్లని ఓట్లును వేరు చేసే ప్రక్రియ జరుగుతున్న సమయంలో మీడియా చేసిన రాద్దాంతం అంతా ఇంతాకాదు. 40 వేల నుంచి 50 వేల వరకు ఓట్లు చెల్లకుండా పోతున్నాయని ఎవరికి వారే పోటాపోటీగా తప్పుడు సమాచారాన్ని టెలికాస్ట్ చేయడంతో కౌంటింగ్ ప్రక్రియను టీవీల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు.
Also Read: ప్రమాదంలో వైయస్సార్ కాంగ్రెస్.. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అదే!
కొన్ని టీవీ చానల్స్ ఏకంగా ఈ విషయంపై డిబేట్లు కూడా పెట్టడం, దీంతో నానా గందరగోళం కూడా చోటు చేసుకోవడంతో ఈ విషయమై ప్రత్యేకంగా ఎన్నికల అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టింది. మంగళవారం 12గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైనా, ఒక్కో రౌండ్ లో అభ్యర్థుల మధ్య మెజార్టీ ఓట్ల వ్యత్యాసం తక్కువ ఉండడంతో పూర్తయ్యే వరకు ఎక్కువ సమయం పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఓటింగ్ సరళిని గమనిస్తే చెల్లని ఓట్లను పక్కన పెట్టిన తరువాత మిగిలిన 2.25 లక్షల ఓట్లలో 50 శాతం కన్న ఒక ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అయితే ఆ మ్యాజిక్ ఫిగర్ దాటడం మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా సాధ్యం కాకపోతే, రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతారు. అయితే ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమని అనిపిస్తోంది. ఆ పరిస్థితి వస్తే ఊహించని ఫలితాలు తెరపైకి రావచ్చని భావిస్తున్నారు. మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఇద్దరు అభ్యర్థులతో పాటు, మొదటి ప్రాధాన్యతా ఓటులో తక్కువ ఓట్లతో వెనుకంజలో మూడో స్థానంలో ఉన్న అభ్యర్థి కూడా వీరికి పోటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా మూడు, నాలుగో ప్రాధాన్యత ఓట్ల వరకు కూడా లెక్కింపు అయ్యే వరకు కౌంటింగ్ కొనసాగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు చివరికి విజయం సాధిస్తారనే విషయమై ఉత్కంఠ నెలకొంది.
(కౌంటింగ్ కేంద్రం నుంచి దహగాం శ్రీనివాస్)