Loksabha Elections 2024: హైదరాబాద్ పై కన్నేసిన కాంగ్రెస్.. బరిలోకి సుప్రీంకోర్టు న్యాయవాది

మాధవి లత రంగంలోకి దిగడంతో హైదరాబాదు పార్లమెంటు స్థానంలో ఎంఐఎం, బిజెపి మధ్య పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు మాధవి లత వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 20, 2024 8:09 pm

Loksabha Elections 2024

Follow us on

Loksabha Elections 2024: హైదరాబాద్.. ఈ పార్లమెంటు స్థానంలో మిగతా పార్టీకి చోటు లేదన్నట్టుగా ఎంఐఎం గెలుచుకుంటూ వస్తోంది. అసదుద్దీన్ ఓవైసీ ఈ స్థానం నుంచి వరుసగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. 1984 నుంచి ఇక్కడ మరో పార్టీ గెలవడం లేదు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం కు వెళ్లకుండా చేయాలనేది బిజెపి ప్లాన్. ఇందులో భాగంగా విరించి హాస్పిటల్ చైర్పర్సన్ కొంపల్లి మాధవిలతను బరిలోకి దింపింది. ఇప్పటికే ఈమె విజయాన్ని కాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మాధవి లత కూడా రంగంలోకి దూకారు. ఇప్పటికే ఆమె పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎంఐఎం పై విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మాధవి లత రంగంలోకి దిగడంతో హైదరాబాదు పార్లమెంటు స్థానంలో ఎంఐఎం, బిజెపి మధ్య పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు మాధవి లత వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. పాతబస్తీలో పలు ప్రాంతాల్లో హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా తన వంతు ప్రచారం చేస్తున్నారు. అయితే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

1984 తర్వాత హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో మరో పార్టీ గెలవకపోవడంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆ సెగ్మెంట్ పై దృష్టి సారించింది. ఈసారి ఎలాగేనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. హైదరాబాద్ పార్లమెంటు స్థానం బరిలోకి షానాజ్ తబస్సుమ్ అనే సుప్రీంకోర్టు న్యాయవాదిని బరిలోకి దించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. షానాజ్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా కొనసాగుతూనే.. ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. షానాజ్ కు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. వాటి వల్లే ఆమె పేరు హైదరాబాద్ పార్లమెంటు స్థానంపై వినిపిస్తోందని సమాచారం. అటు మాధవి లతను రంగంలోకి దింపి బిజెపి, ఇటు షానాజ్ తో కాంగ్రెస్.. మధ్యలో అసదుద్దీన్ తో ఎంఐఎం.. ఫలితంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో త్రిముఖ పోరు ఏర్పడింది. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో.. కాలం గడిస్తే గాని ఈ ప్రశ్నకు సమాధానం లభించదు.