Malkajgiri: మాల్కాజ్ గిరి లో కాంగ్రెస్ సర్వే.. షాకింగ్ ఫలితం

2018 ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి 2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై విజయం సాధించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 14, 2024 3:57 pm

Malkajgiri

Follow us on

Malkajgiri: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకొని.. పలు మున్సిపాలిటీలను కైవతం చేసుకొని.. జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోను అదే దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నది. ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో జాబితాలో మిగతా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని ఆశిస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు కిందిస్థాయి నాయకులకు సలహాలు ఇస్తున్నారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజ్ గిరి లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడ షాకింగ్ ఫలితం వచ్చినట్టు తెలుస్తోంది.

2018 ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి 2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై విజయం సాధించారు. అనంతరం 2023 లో జరిగిన ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ఈ స్థానంలో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి పరిస్థితి కూడా దాదాపు అంతే. భారత రాష్ట్ర సమితికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత.. ఈటల రాజేందర్ హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు హుజరాబాద్, ఇటు గజ్వేల్ స్థానాల్లో ఓడిపోయారు. దీంతో బిజెపి అధిష్టానం ఆయనకు మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం టికెట్ కేటాయించింది. దీంతో ఆయన అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పార్లమెంట్ స్థానానికి సంబంధించి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించకపోయినప్పటికీ.. ఇటీవల సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో ఈటల రాజేందర్ ఎంపీగా గెలుస్తారని తేలినట్టు సమాచారం. సుమారు 17% ఓటు బ్యాంకును ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే ఎక్కువ సాధిస్తారని తేలింది. దీంతో కాంగ్రెస్ పార్టీ డోలాయమానంలో పడినట్టు సమాచారం. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ స్థానంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించారు. అంటే ఎన్నికల్లో కూడా మల్కాజ్ గిరి ఓటర్లు అదే సెంటిమెంట్ కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి సర్వేలో ప్రతికూల ఫలితం వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుందో చూడాలి.