https://oktelugu.com/

CM Revanth Reddy : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన రేవంత్ రెడ్డి.. రుణమాఫీపై కీలక ప్రకటన..

ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి ఛాలెంజ్‌ చేశారు. రుణమాఫీ చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు విసిరిన సవాల్‌ స్వీకరించి ఈమేరకు రుణమాఫీ ప్రక్రియ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా మూడు విడతల్లో రైతు రుణాలు మాఫీ పూర్తి చేస్తామని తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 17, 2024 / 07:29 PM IST
    Follow us on

    CM Revanth Reddy : గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు.. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. ఈ క్రమంలో హామీల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రైతు రుణమాఫీకి రేపు(జూలై 18న) శ్రీకారం చుట్టనున్నారు. ఈమేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. రూ.లక్ష లోపు రుణాలన్నీ గురువారం(జూలై 18)న సాయంత్రం మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు.

    మూడు విడతల్లో మాఫీ..
    ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి ఛాలెంజ్‌ చేశారు. రుణమాఫీ చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు విసిరిన సవాల్‌ స్వీకరించి ఈమేరకు రుణమాఫీ ప్రక్రియ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా మూడు విడతల్లో రైతు రుణాలు మాఫీ పూర్తి చేస్తామని తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్‌ నాయకులతో సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం(జూలై 17న) సమావేశం అయ్యారు.

    వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకారం..
    2022, మే 06వ తేదీన వరంగల్‌ డిక్లరేషన్‌ ద్వారా రాహుల్‌గాంధీ రైతుల పంట రుణాలు రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని మాట ఇచ్చారని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్‌ రూ.28 వేల కోట్లు రైతు రుణమాఫీ చేయలేకపోయారని విమర్శించారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పామని తెలిపారు. ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారన్నారు. కానీ, ఇచ్చిన మాటకు కట్టుబడి నాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. నేడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తున్నామన్నారు.

    దేశానికి తెలంగాణ మోడల్‌..
    గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనం అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్‌ గాంధీ మాట ఇచ్చారని, ఆమేరకు చేసి తీరుతున్నామని తెలిపారు. దీంతో తెలంగాణ దేశానికి మోడల్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. గురువారం(జూలై 18) సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు రూ.7 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇక ఈ నెలాఖరులోగా రెండో విడతగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. మూడో విడతలో ఆగస్టులో రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ప్రతీ రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

    కేసీఆర్‌లా మభ్యపెట్టలేదు..
    ఇక గతంలో కేసీఆర్‌ రుణమాఫీకి ఐదేళ్లు సమయం తీసుకున్నారని, అయినా రూ.లక్ష రుణాలు కూడా మాఫీ చేయలేకపోయారని తెలిపారు. ఐదేళ్లు మభ్యపెడుతూ వచ్చారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రైతు రుణమాఫీపై చిత్తశుద్ధి ఉందని తెలిపారు. అందుకే కేసీఆర్‌లా మభ్యపెట్టకుండా ఏకమొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని చెప్పారు. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలన్నారు.

    దేశవ్యాప్తంగా చర్చ జరగాలి..
    ఇక తెలంగాణలో రైతుల రుణమాఫీపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈమేరకు పార్లెమెంటులో ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించాలని సూచించారు. తెలంగాణలో ఒకే విడతలో రూ.31 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన విజయాన్ని దేశానికి తెలియజేయాలన్నారు. ఇక గురువారం గ్రామాల్లో, మండల కేంద్రాల నుంచి రైతు వేదికల వరకు బైక్‌ ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలన్నారు. ఏడు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.