CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో వరదల్లో చనిపోయిన కుటుంబాలకు చెల్లిస్తున్న సహాయాన్ని పెంచారు. దీనిపై కీలక ప్రకటన చేశారు. వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నామని.. త్వరలో ఆ సాయాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. పాడి గేదెలు చనిపోతే గతంలో ఆర్థిక సాయం 30 వేల వరకు ఇచ్చేవారని.. ఇప్పుడు దానిని 50 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. మేకలు లేదా గొర్రెలు చనిపోతే ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 3000 నుంచి 5000 కు పెంచుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. మృతులు, పశువులు చనిపోయినప్పుడు చెల్లించే ఆర్థిక సహాయాన్ని వెంటనే అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటే.. ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కంటిజెన్సీ ఫండ్ కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు ఒక్కొక్కరికి ఐదు కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
24 గంటల పాటు పనిచేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లు 24 గంటల పాటు పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, నిత్యావసరాలను తక్షణమే పంపిణీ చేయాలని, సరుకుల సరఫరా లో అవాంతరాలు తలెత్తకుండా చూడాలన్నారు. భారీ వర్షాలపై తలెత్తిన నష్టానికి సంబంధించి ప్రభుత్వానికి వెంటనే ప్రాథమిక నివేదికలు సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని రేవంత్ రెడ్డి కోరారు. దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. ప్రకృతి విపత్తును పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికార బృందాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణకు రావాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఆ వ్యవస్థ ఏర్పాటు
ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్తు కాలంలో ఇటువంటి విలయాలను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (TGDRF) ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.. విద్యుత్ సరఫరాకు సంబంధించి 25 భారీ టవర్లు కూలిపోయినప్పటికీ సిబ్బంది వెంటనే స్పందించారని.. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు తలెత్తకుండా, ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారిని గుర్తించి వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం, నిత్యావసరాలు అందించాలని కోరారు.. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరూ వాటిని దాటేందుకు ప్రయత్నించొద్దని ముఖ్యమంత్రి విన్నవించారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ విభాగాలు సమష్టిగా వరద బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారు.