CM Revanth Reddy(3)
CM Revanth Reddy: రాష్ట్రంలో ఏడు నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఇటీవలే ప్రభుత్వం కొత్త పంచాయతీలను కూడా ఏర్పాటు చేసింది. కానీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇటీవలే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. దీంతో అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓటరు జాబితా తెప్పించుకున్నారు. దాని ప్రకారం పంచాయతీల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు పంచాయతీ రిజర్వేషన్లు పాతవే కొనసాగించే అలోచనలో సీఎం ఉన్నారు. అయితే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సవరించాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వడం లేదు. బీసీ గణన పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలంటే మరో ఆరు నెలల సమయం కావాలి. సెప్టెంబర్ 1 నుంచి బీసీ గణన చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇందుకు నిధులు కూడా కేటాయించామని తెలిపారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం కీలక ప్రకటన చేశారు. దీంతో పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి షురూ కానుంది.
రిజర్వేషన్ల మార్పు..
త్వరలో బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. కమిషన్ నియమించిన తర్వాతనే బీసీ గణన కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఓటరు జాబితా ఆధారంగా పంచాయతీల వారీగా ఓటరు జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత పంచాయతీల రిజర్వేషన్లు సవరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రిజర్వేషన్ల మార్పు అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. రిజర్వేషన్లు మార్చిన తర్వాతనే ఎన్నికలు ఉంటాయని తెలిపారు. దీంతో బీసీ రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరిలో ముగిసిన పదవీకాలం..
ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల పాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించింది ప్రభుత్వం. జూలై 4తో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల టర్మ్ ముగిసింది. మండల పరిషత్ ల బాధ్యతలను ఎంపీడీవో, పైర్యాంక్ అధికారులకు, జిల్లా పరిషత్‌ల బాధ్యతలను కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. త్వరలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడనుంది. వచ్చే నెలలోనే పంచాయతీలకు కొత్త సర్పంచులు రానున్నారు.
రేవంత్ వ్యూహం ఇదే..
ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ మరింత బలహీనపడడం, బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచినా గ్రామస్థాయిలో ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. ఈ అంశాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తాజాగా రుణమాఫీ చేసిన నేపథ్యంలో పల్లెలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలం వాతావరణం ఉందని భావిస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Cm revanth reddy made a key announcement on the conduct of panchayat elections