CM Revanth Reddy: తెలంగాణలో సంచలనం రేపుతున్న హైడ్రాపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. కబ్జాల కూల్చివేత విషయంలో వెనక్కి తగ్గది లేదని పునరుద్ఘాటించారు. హెడ్రా కూల్చివేతలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సచివాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. హైడ్రా కూల్చివేతలపై ఒత్తిళ్లు భారీగానే వస్తున్నాయి. అయినా వాటిని ఎదుర్కొంటాం. అంతే తప్ప వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని పునరుద్ఘాటించారు. హైడ్రాతోపాటు సీఎంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి ఖండించారు. ‘నా కుటుంబ సభ్యులు లేదా బంధువులెవరైనా కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే వాటిని నేనే దగ్గరుండి కూల్చివేయిస్తాను’ అని తెలిపారు. సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా మొదటగా కూల్చివేసిందని గుర్తు చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్ లో కేటీఆర్ ఎందుకు పేర్కొనలేదు. నిర్మాణాలకు సర్పంచులు కాదు.. అధికారులే అనుమతి ఇస్తారని.. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు ఈ విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు.
కేటీఆర్‌ను డిస్‌క్వాలిఫై చేయాలి..
ఎన్నికల అఫిడవిట్‌లో జన్‌వాడ ఫామ్‌హౌస్ విషయాన్ని కేటీఆర్ ఎందుకు ప్రస్తావించలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం కేటీఆర్‌ను డిస్ క్వాలిఫై చేయాలని అన్నారు. హైడ్రా ఇప్పటివరకూ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమని తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకే తొలి ప్రాధాన్యమని సీఎం రేవంత్ అన్నారు. ‘హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ఓఆర్‌ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలో ఉన్నాయని వెల్లడించారు. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు డ్రైనేజ్‌ను ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లోకి వదులుతున్నారు. ఆ నీళ్లు హైదరాబాద్ ప్రజలు తాగాలా అని ప్రశ్నించారు. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తామని తెలిపారు. 30 ఏళ్ల కింద కట్టిన అక్రమ నివాస కట్టడమైనా హైడ్రా చర్యలు తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు.
విద్యా సంస్థలనూ కూలుస్తాం..
విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సీఎం తెలిపారు. ఒవైసీ కాలేజీల విషయంలో విద్యా సంవత్సరం నష్టపోతుందనే టైం ఇచ్చినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఆ బిల్డింగ్ కూల్చాలా వద్దా అనేది ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ‘రాయదుర్గంలో కూల్చివేత సరైనదే అన్నారు. 111 జీవోపై సుప్రీంకోర్టు, ఎన్‌జీటీ గైడ్ లైన్స్ పాటిస్తున్నామన్నారు. సెక్రటేరియట్, జీహెచ్ఎంసీ వంటి భవనాలపై సుప్రీంకోర్టు అనుమతి ఉందిని తెలిపారు.
రుణమాఫీపై..
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ రైతుకు మాఫీ జరుగుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రుణమాఫీపై అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. రూ.2 లక్షలపై రుణం తీసుకున్న వారు పై మొత్తాన్ని కడితే రుణమాఫీ అయిపోతుంది. వాటికి నిధులు కూడా విడుదల చేశాం. హరీశ్‌రావు, కేటీఆర్ ప్రతీ రైతు వద్దకు వెళ్లొచ్చని.. రుణమాఫీ అవ్వని వారి వివరాలను సేకరించి కలెక్టర్‌కు ఇవ్వొచ్చని సూచించారు.