CM Revanth Reddy
CM Revanth Reddy: తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచితాల మీద ఉచితాలు ప్రకటించారు. ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియాగాంధీ లాంటి వారిని పిలిపించి డిక్లరేషన్లు ప్రకటించారు. కానీ వాటి అమలులో మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో రేవంత్ రెడ్డికి తెలుసు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే నాటి కెసిఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం షాపులు ఏర్పాటు చేసింది. గడువు ముగియకముందే ముందుగానే వైన్ షాపుల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించింది. తద్వారా అప్పటి ఎన్నికల్లో నెగ్గడానికి ప్రణాళికలు రూపొందించింది. కానీ ఆ ఎన్నికల్లో ప్రజలు వేరే విధంగా తీర్పు ఇవ్వడంతో భారత రాష్ట్ర సమితికి తల బొప్పి కట్టింది. ఇక నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. వాటిల్లో కొన్ని మాత్రమే అమలులో పెట్టింది. అమలు ఉన్న పథకాలు కూడా అంతంతమాత్రంగానే ప్రజలకు చేరువవుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ప్రస్తావిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. ఇది ఊహించిన పరిణామమే అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరికొత్త పల్లవి అందుకుంది.
Also Read: సీఎంఓను ప్రక్షాళన చేసిన రేవంత్ రెడ్డి.. కొత్త టీం ఇదే
అప్పుల లెక్కలు
ఇక ఇటీవల జరిగిన ప్రతి సమావేశంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు. చివరికి ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరితే.. తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే బాగుపడుతోందని.. కార్మికులు సమ్మెకు దిగితే నష్టం తీవ్రంగా వాటిల్లుతుందని వాపోయారు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగోలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని రేవంత్ రెడ్డి పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగో లేనప్పుడు.. అని హామీలు ఎవరు ఇవ్వమన్నారు? ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించమని ఎవరు చెప్పారు? నాడు అవుటర్ రింగ్ రోడ్డు ను లీజుకు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని లెక్కలతో సహా వివరించారు. మరి అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేయాలంటే డబ్బులు ఉండాలనే విషయం రేవంత్ రెడ్డికి తెలియదా.. అంటే అధికారం కోసం ఎన్ని హామీలైనా ఇస్తారా? చివరికి ఓట్లు వేయించుకొని ప్రజలను వెర్రివాళ్లను చేస్తారా? అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.. ప్రతి సమావేశంలోనూ బడ్జెట్ పద్మనాభం లాగా లెక్కలు వేయడం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం.. పరిపాటిగా మారిపోయిందని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
బడ్జెట్ పద్మనాభం లాగా ప్రతినెలా లెక్కలు వేసుకొని ప్రభుత్వం నడుపుతున్నా – రేవంత్ రెడ్డి pic.twitter.com/lWtOvCqDtW
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2025
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Cm revanth reddy budget issues analysis