https://oktelugu.com/

CM KCR : కేసీఆర్ మాట మీద నిలబడుతారా? కలబడుతారా?

మరో వైపు పార్టీ శ్రేణులు కూడా.. సిట్టింగ్లను మారిస్తే కేసీఆర్ ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందని.. ఇది పార్టీలో తీవ్ర అసంతృప్తులకు దారితీస్తుందని అభిప్రాయపడుతున్నాయి.

Written By:
  • Rocky
  • , Updated On : July 23, 2023 2:10 pm
    Follow us on

    CM KCR : మరి కొద్ది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ 9 సంవత్సరాలపాటు పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. మూడోసారి కూడా అధికారంలోకి రావాలి అనుకుంటున్నారు. మరి క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? సిట్టింగ్లందరికీ టికెట్లు ఇస్తామని మూడు పర్యాయాలు చెప్పిన కేసీఆర్ ఆ మాట నిలుపుకుంటారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

    వ్యతిరేకత ఉంది
    అధికార పార్టీ పట్ల జనంలో వ్యతిరేకత ఉంది. సర్వేల్లోనూ ఇదే వ్యక్తమౌతోంది. దీనికి గుర్తించిన కేసీఆర్.. దీన్ని అధిగమించేందుకు సిట్టింగ్లను మార్చే వ్యూహాన్ని ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే దీనిపైనే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతున్నది. జా వ్యతిరేకత అంటే కేవలం ఎమ్మెల్యేల పైన కాదు కదా! ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత ఉంటుంది. అలాంటప్పుడు కేవలం మమ్మల్ని మాత్రమే బలి పశువులను చేస్తారా అంటూ? కొంతమంది ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతనే ప్రజలు స్థానిక ఎమ్మెల్యేలపై చూపుతారన్న విషయాన్ని అధిష్టానం గుర్తించాలని కోరుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను కూడా ఎమ్మెల్యేలపై రుద్దడం సరికాదని అంటున్నారు. వ్యతిరేకతకు కారణమైన అంశాలను గుర్తించి ఎదుర్కోవాలే తప్ప.. వాటిని కూడా సిట్టింగ్లపైకి నెట్టివేయడం చివరికి పార్టీకే నష్టం చేస్తుందని పేర్కొంటున్నారు. మరో వైపు పార్టీ శ్రేణులు కూడా.. సిట్టింగ్లను మారిస్తే కేసీఆర్ ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందని.. ఇది పార్టీలో తీవ్ర అసంతృప్తులకు దారితీస్తుందని అభిప్రాయపడుతున్నాయి.
    25 మంది అవుట్
    అధికార పార్టీ చేయించుకున్న సొంత సర్వేల ద్వారా చాలా నియోజకవర్గాల్లో ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో 30 నియోజకవర్గాల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్టు సమాచారం. పార్టీల నుంచి వచ్చిన 15 మందిలోనూ సగం మంది ఎమ్మెల్యేల పట్ల జనం వ్యతిరేకంగా ఉన్నట్టు పార్టీ సర్వేలో తేలిందని సమాచారం. గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలిచిన 88 స్థానాలకు తోడు ఇతర పార్టీల నుంచి పదిమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. తాజా సర్వేలను ఆధారంగా తీసుకుంటే ఈ 103 మందిలో ఇప్పుడు 25 మందికి పైగా సిట్టింగ్ ల పై తీవ్ర వ్యతిరేకత, మరో 25 మందికి పైగా స్థానంలో కొంతమేర వ్యతిరేకత ఉన్నట్టు తేలిందని తెలుస్తోంది. వీటిలో తీవ్ర వ్యతిరేకత ఉన్న స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతారు అన్న చర్చ జరుగుతోంది. ఈ స్థానాల్లో ఏ రకంగా చూసినప్పటికీ పార్టీ గెలుపు కష్టమే అనే అభిప్రాయం రావడంతో అభ్యర్థిని మార్చే వ్యూహం అమలు చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే కేసీఆర్ ఆదేశం మేరకు తాము మొత్తం నియోజకవర్గాల్లో ఉంటున్నామని, రెండు సార్లు అధికారం ఇచ్చాం కదా! మూడోసారి కూడానా అనే వైఖరి ప్రజల్లో ఉన్నట్టు తమ దృష్టికి వస్తున్నదని కొంతమంది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు చెబుతున్నారు. రెండుసార్లు వరుసగా ప్రభుత్వం ఉండటం, దీనికి తోడు నియంతృత్వ ధోరణలు పెరిగిపోయాయి అన్న అసంతృప్తి, కొందరి పెత్తనమే నడుస్తోంది అనే భావన.. ఇలాంటివన్నీ కలగలిసి ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసాయని అంగీకరిస్తున్నారు. దానిని కేవలం సిట్టింగ్ లను ఎరగా వేసి అధిగమిద్దాం అనుకుంటే అసలుకే మోసం వస్తుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.