TG Number Plate: తెలంగాణలో రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్ టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు టీఎస్ స్థానంలో టీజీ పేరుతో జరపాలని పేర్కొంది. నోటిఫికేషన్ ప్రకారం సీరియల్ నంబర్ 29A, TS కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కోసం వాహనాలపై రిజిస్ట్రేషన్ గుర్తు టీజీగా సవరించిన గెజిట్ నోటీఫికేషన్ జారీ చేశారు.
ఇప్పటికే రిజిస్ట్రేషన్లు..
కాగా తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్ నుంచి టీజీకి మార్చుకోవడానికి మార్చిలో రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు కేంద్ర రవాణా శాఖతో సంప్రదింపులు జరిపారు. దీంతో∙కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదం తెలిపింది. గెజిట్ మాత్రం తాజాగా జారీ చేసింది. అయితే గెజిట్‌కు ముందే మార్చి 15 నుంచే తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ టీఎస్‌స్థానంలో టీజీతో ప్రారంభించారు.
రాష్ట్రంలో 1.60 కోట్ట వాహనాలు..
రాష్ట్రంలో మొత్తం 1.60 కోట్ల వాహనాలు ఉన్నాయి. వాటిలో 1.18 కోట్ల ద్విచక్రవాహనాలు, 21.32 లక్షల కార్లు, 7,27,000 ట్రాక్టర్లు, ట్రైలర్లు, 6,18,000 రవాణా వాహనాలు తదితరాలు ఉన్నాయి. ఇప్పటికే నడుపుతున్న వాహనాల నంబర్లలో ఎలాంటి మార్పు ఉండదని రవాణా శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. తాజాగా టీఎస్ స్థానంలో టీజీతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. జిల్లాల కోడ్ తర్వాత రవాణా వెహికల్స్, ఆర్టీసీ బస్సుల సిరీస్ నిర్దేశిత అక్షరాలతో ప్రారంభం అవుతుంది. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్ ఉంటాయి. ఆర్టీసీ బస్సులు ఎప్పటిలాగే జెడ్ సిరీస్‌తో జరుగుతున్నాయి.