Minister Ponnam Prabhakar: హైడ్రా హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేయడాన్ని మొదటినుంచి భారత రాష్ట్ర సమితి ఒక కోణంలో మాత్రమే చూస్తోంది. దాని అనుబంధ సోషల్ మీడియా గ్రూపులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, హైడ్రాకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. హైడ్రా పని తీరుకు సంబంధించి ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా భూతద్దంలో పెట్టి చూస్తున్నాయి. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ హైడ్రా పై చేసిన వ్యాఖ్యలను ఇదేవిధంగా చూపించే ప్రయత్నం చేశాయి. “రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పనులు చేయొద్దు, గతంలో ప్రభుత్వ విధానాలలో చోటు చేసుకున్న తప్పులను ఎత్తిచూపితే మా వాళ్లపై కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మీకు నచ్చకపోవచ్చు. ప్రజా ప్రతినిధులు మీకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు మీకు నచ్చిన విధంగా నిరసన చేసుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదు. ఈ విషయంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ కు నేను ఆదేశాలు జారీ చేస్తున్నానని”పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యల్లో ఆయన ప్రభుత్వం తరఫున మాట్లాడినట్టే ఉంది. కానీ ఇదే విషయాన్ని వేరే విధంగా అన్వయించి చెప్పడంతో పొన్నం ప్రభాకర్ ఇరుకున పడాల్సి వచ్చింది. చూశారా పొన్నం ప్రభాకర్ హైడ్రా బాధితుల ఇబ్బందులను సోషల్ మీడియాలో పెట్టొద్దని బెదిరిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అంటూ ప్రజల సమస్యలను వెలుగులోకి రాకుండా చేస్తున్నారంటూ.. ఓ సోషల్ మీడియా గ్రూప్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. సహజంగా ఇలాంటి సమయంలోనే మంత్రులు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే భారత రాష్ట్ర సమితిని పక్కనపెట్టి, కాంగ్రెస్ కు తెలంగాణ జనం అధికారం ఇచ్చారు. అలాంటి తెలంగాణ జనం సమస్యలను సోషల్ మీడియాలో పెట్టొద్దంటే అది మొదటికే మోసం వస్తుంది. అధికారం శాశ్వతం కాదు. ఐదేళ్లు గడిస్తే అటువాళ్లు ఇటు కావచ్చు. ఇటువంటి అటు వెళ్లొచ్చు. కానీ ఈ విషయాన్నే పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు మర్చిపోతున్నారు. అదే ఇక్కడ అసలైన విధి వైచిత్రి. మరి ఇలాంటి మాటలు మాట్లాడకుండా.. వచ్చే రోజుల్లోనైనా కాంగ్రెస్ నాయకులు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకుంటే అందుకు తగ్గట్టుగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ ఈ అనుభవం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది.. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినప్పటికీ.. కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకోవడంలో విఫలమైంది.. 10 సంవత్సరాల తర్వాత అధికారం దక్కింది.. అయితే దానిని స్థిరీకరించుకోవడంలో ఆ పార్టీ నాయకులు ఆశించినంత స్థాయిలో పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం పార్టీకి డ్యామేజ్ చేస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాయకులు తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
హైడ్రా బాధితుల వీడియోలు సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతాం – మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/ZCemDWXxDb
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2024