Hydra: హైడ్రా రంగనాథ్ దూకుడుకు బ్రేక్.. ఇన్నాళ్లకు గట్టి షాక్ తగిలింది

రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తేవడమే ఆలస్యం.. దాని కమిషనర్ గా నియమితులైన రంగనాథ్ దూకుడు కొనసాగించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ నుంచి మొదలుపెడితే ఆమీన్ పూర్ చెరువు పక్కన ఉన్న బహుళ అంతస్తుల భవనాన్ని పడగొట్టడం వరకు రంగనాథ్ తనదైన దూకుడు కొనసాగించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 28, 2024 8:44 am

Hydra(9)

Follow us on

Hydra: సీనియర్ ఐపీఎస్ అధికారిగా రంగనాథ్ కు పేరుంది. పైగా గత ప్రభుత్వంలో ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్ గా పని చేశారు. ఆ సమయంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారికి చుక్కలు చూపించారు. క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడ లేదు. నాటి ప్రభుత్వ పెద్దలు ఆయనకు అన్ని విధాలుగా అండదండలు అందించడంతో రంగనాథ్ వరంగల్ లో తనదైన మార్క్ పరిపాలనను చూపించారు. ఇక అప్పట్లో భారత రాష్ట్ర సమితి నాయకులే స్వయంగా కేటీఆర్ ను కలిసి.. రంగనాథ్ ను బదిలీ చేయించాలని మొరపెట్టుకున్నారంటే ఆయన ఏ స్థాయిలో పనిచేశాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హైడ్రా అధిపతిగా రంగనాథ్ దూకుడు కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న చెరువులు, నీటి వనరుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తున్నారు. బఫర్ జోన్ లు, ఎఫ్ టీ ఎల్, శిఖం భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను పడగొడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. రంగనాథ్ కొనసాగిస్తున్న దూకుడు సహజంగానే భారత రాష్ట్ర సమితికి నచ్చడం లేదు. ఒకప్పుడు రంగనాథ్ చేస్తున్న పనిని గొప్పగా పొగిడిన భారత రాష్ట్ర సమితి పెద్దలు.. ఇప్పుడు విమర్శించడం మొదలుపెట్టారు. హైడ్రా పడగొడుతున్న అక్రమ భవనాల విషయాన్ని పక్కన పెట్టి.. పేదల ఇళ్ళను కూల్చి వేస్తున్నారనే పల్లవి అందుకోవడం ప్రారంభించారు. తన పార్టీ అనుకూల నెటిజన్ల ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేయిస్తున్నారు. ఇది సహజంగానే అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. దీనిపై గట్టి కౌంటర్ ఇవ్వడంలో ఆ పార్టీ వెనుకబడిందనే చెప్పాలి.

ఇక ఇటీవల ఆమీన్ పూర్ చెరువు పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా పడగొట్టింది. అయితే ఆ భవనానికి కోర్టు స్టే ఉంది. ఆ భవన యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు స్పందించక తప్పలేదు. స్టే ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కోర్టు ప్రశ్నించింది. వచ్చే సోమవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని సూచించింది. లేకుంటే వర్చువల్ గా నైనా హాజరుకావాలని ఆదేశించింది. హైడ్రా రంగనాథ్ కు కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. మరోవైపు హైడ్రా పనితీరును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా తప్పుపడుతోంది. తన సొంత మీడియాలో ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తోంది. దీంతో హైడ్రా చెడు పనిచేస్తుందని దుష్ప్రచారం చేయిస్తోంది. ఫలితంగా అధికార కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోంది. సోమవారం రంగనాథ్ కోర్టుకు హాజరవుతారా? కోర్టు ఎదుట ఏం చెబుతారు? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.