KTR Politics: ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరగడం సహజం, ప్రజలు క్షమించడానికి సమయం పడుతుంది. తర్వాతి ఎన్నికల్లో ప్రజలే భవిష్యత్‌ను నిర్ణయిస్తారు. కానీ పదేళ్ల అధికారంతో తెలంగాణ చాంపియన్‌లుగా ప్రచారం చేసుకున్న బీఆర్‌ఎస్‌ను 2023 ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదు. హామీలు అమలు చేయకపోయినా విపక్షాల నుంచి తప్ప ప్రజల నుంచి విమర్శలు రావడం లేదు. ఇక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే రేవంత్ సర్కార్‌ను నిత్యం టార్గెట్ చేస్తున్నారు. దీంతో విశ్లేషకులు నేతలకు ఓపిక ఉండాలని సూచిస్తున్నారు.
నిత్యం విమర్శలే..
కేటీఆర్ ప్రతీ మాట సామాన్యుడి మనసులో కౌంటర్‌గా మారుతోంది. ఇది తన మాటల విలువను తగ్గిస్తూ, పార్టీకి నష్టం కలిగిస్తోంది. రేవంత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కేటీఆర్ స్వయం పార్టీ బలోపేతానికి అడ్డంకిగా మారుతున్నారు. గత అధికార కాలంలోని తప్పులు గుర్తుంచుకోకుండా విమర్శిస్తుండడంతో ప్రజలు పెద్దగా కనెక్ట్ కావడం లేదు.
ఫిరాయింపులను తప్పు పడుతూ..
తాజా పార్టీ మార్పులపై కేటీఆర్ వ్యాఖ్యలు గతాన్ని గుర్తు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ అధికారంలో ఉంటూ ప్రతిపక్షాలను అణచివేసి, తెలంగాణ పోరాటకారులను దూరం చేసి, కొత్తలకు పదవులు పంచారు. ఇప్పుడు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్నారు. స్పీకర్ ఆధారాలు లేవని ప్రకటించినా, కేటీఆర్ సోషల్ మీడియాలో రాజ్యాంగ విలువలను ప్రశ్నిస్తున్నారు. అప్పటి ఫిరాయింపులు ‘బంగారు తెలంగాణ‘ పేరుతో జరిగాయని ప్రజలు మరువలేదు కేటీఆర్.
మౌనమే మేలు..
ప్రస్తత పరిణామాల్లో మౌనం చాలా మంచిది. ప్రజలకు ఆలోచనకు సమయం ఇవ్వాలి. గత తప్పులకు పశ్చాత్తాపం చెంది, భవిష్యత్తులో అవి జరగకుండా హామీ ఇవ్వాలి. పడిగట్టు మాటలు, నాన్ స్టాప్ విమర్శలు ప్రజల మద్దతు ఆకర్షించవు. కేటీఆర్ దీన్ని గుర్తించి వ్యూహం మార్చితే పార్టీకి లాభం.
అధికారంలో ఉంటూ అందరినీ ‘గులాబీ కారు‘లో ఎక్కించిన గతం ప్రజల మనసుల్లో ఉంది. ఇప్పుడు విమర్శలు చేసినా, స్వీయ పరిశీలన లేకపోవడం వల్ల ప్రజలు దూరమవుతున్నారు. తగిన సమయం కోసం వేచి ఉండి.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత స్పందిస్తే ప్రజల మద్దతు లభిస్తుంది.