Telangana Cabinet Expansion: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్‌ టీంలోకి కొత్త మంత్రులు వీరే!

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. పదేళ్ల తర్వాత అధికారం దక్కడంతో పాలనలోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది. రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు పూర్తయింది.

Written By: Raj Shekar, Updated On : ఆగస్ట్ 14, 2024 1:05 సా.

Telangana Cabinet Expansion

Follow us on

Telangana Cabinet Expansion: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత అధికారానికి దూరమైంది. మళ్లీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పాలనలోనూ ప్రత్యేకత చూపడానికి ప్రయత్నిస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి గత కాంగ్రెస్‌ సంస్కృతికి భిన్నంగా అందరినీ కలుపుకుపోతూ పాలన సాగిస్తున్నారు. సమష్టి నిర్ణయాలతో ప్రజాపాలన సాగిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా అందిస్తున్నారు. ఇక హామీల్లో కీలకమైన రుణమాఫీ కూడా చివరి దశకు వచ్చింది. ఇప్పటికే రూ.1.,50 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశారు. ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయనున్నారు. దాదాపు 9 నెలలుగా సీఎం, 11 మంది మంత్రులతో పాలన సాగిస్తున్న సీఎం మిగిలిన ఖాళీలు భర్తీ చేయడంపైనా దృష్టి పెట్టనున్నారు. తన టీంలోకి కొత్తవారిని తీసుకోబోతున్నారు.

మంత్రివర్గ విస్తరణ..
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. కొంత కాలంగా మంత్రివర్గ విస్తరణ పైన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా పార్టీ అధినాయకత్వం మంత్రివర్గ విస్తరణతోపాటుగా నామినేటెడ్‌ పదవుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్‌ ఢిల్లీలో రెండు రోజుల్లో పార్టీ హైకమాండ్‌తో భేటీ కానున్నారు. ఆ సమయంలోనే నూతన పీసీసీ చీఫ్‌.. మంత్రివర్గ విస్తరణ..నామినేటెడ్‌ పదవులను అధికారికంగా ప్రకటించనున్నారు.

కొత్తగా ఆరుగురికి ఛాన్స్‌..
రేవంత్‌ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. అయితే ఒకేసారి ఆరు పదవులు భర్తీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. నలుగురిని మాత్రమే ప్రస్తుతానికి ఎంపిక చేసినట్లు సమాచారం. గ్రేటర్‌ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్‌ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మంత్రి పదవుల రేసులో నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మహబూబ్నగర్‌ నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్‌ మంత్రి పదవులకు పోటీ పడుతున్నారు. ప్రాంతీయ –సామాజిక సమీకరణాల్లో భాగంగా సుదర్శన్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి పేర్లు మంత్రి పదవులకు దాదాపు ఖరారైనట్లు సమాచారం.

నామినేటెడ్‌ పదవుల భర్తీ..
మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్‌ పదవులనూ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎస్టీని నియమిస్తే బాలూనాయక్‌కు డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ వర్గాల నుంచి టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు బాలూనాయక్‌ కూడా మంత్రి పదవి రేసులో ఉంటారు. ఆదిలాబాద్లో వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, గడ్డం వినోద్‌ పోటీలో ఉన్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు డిప్యూటీ స్పీకర్, చీఫ్‌ విప్‌ పదవులు ఇస్తారని తెలుస్తోంది.

మున్నూరు కాపులకు బీసీ కమిషన్‌ చైర్మన్‌..
బీసీ కమిషన్‌ చైర్మన్‌ పోస్టును మున్నూరుకాపు సామాజిక వర్గానికి కేటాయించే ఆలోచనలో సీఎం రేవంత్‌ ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ పోస్టు కీలకంగా మారింది. ఈ పదవికి మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకులు వి.హన్మంతరావు, గోపిశెట్టి నిరంజన్‌లో ఒకరికి ఇచ్చే చాన్స్‌ ఉంది. రైతు, విద్యా కమిషన్‌ చైర్మన్లుగా కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి పేర్లు ఖరారైనట్లు సమాచారం.

Tags