https://oktelugu.com/

Ajit Pawar : తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన అజీత్ పవార్.. ఆ తప్పు ఒప్పుకున్న నేత

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలే. రాజకీయాలు కుటుంబాల వరకు రావద్దని, సుప్రియపై తన భార్యను పోటీచేయించడం తప్పేనంటూ స్పందించారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 14, 2024 / 01:06 PM IST

    Ajith pawar

    Follow us on

    Ajit Pawar : మహారాష్ట్ర రాజకీయాలు కొంతకాలంగా రసవత్తరంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలో చీలిపోయిన శివసేన, ఎన్సీపీ వర్గాలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. అయితే ఎన్సీపీ చీలిక వర్గం నేత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, కుటుంబాలను వేరుగా ఉంచాలని పేర్కొన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన చెల్లి సుప్రియా సూలేపై తన భార్యను నిలబెట్టి తప్పు చేశానంటూ పేర్కొన్నారు. అయితే సునేత్రాను పోటీ చేయించడం తాను తీసుకున్న నిర్ణయం కాదని.., తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయమని చెప్పుకచ్చారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చేస్తున్న జన సమ్మాన్ యాత్రలో భాగంగా ఒక మరాఠీ వార్తా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ నేను నా అక్కాచెల్లెళ్లను ప్రేమిస్తాను. రాజకీయాలను ఇంటి వరకు తేకూడదు. సుప్రియాపై నా భార్యను పోటీకి దింపి తప్పు చేశాను. ఇలా చేసి ఉండకూడదు. కానీ ఇది ఎన్సీపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం. అది నేను ఆలోచిచంలేదు. కానీ ఇప్పుడు అది తప్పు అని నేను భావిస్తున్నా అని పేర్కొన్నారు. త్వరలో మహారాష్ర్టలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అజిత్ పవార్ జనసమ్మాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చే పథకానికి ఆయన ప్రస్తుతం పూర్తి స్థాయి ప్రచారం కల్పిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో మహారాష్ర్టలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

    అయితే గతేడాది ఎన్సీపీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ నేతృత్వంలోని పలువురు ఎమ్మెల్యేలు శివసేన, బీజేపీ సర్కారులో చేరిపోయారు. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ దే ఎన్సీపీ అంటూ ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. కాగా సునేత్రపై సుప్రియా సూలే 1.50 లక్షల ఓట్లతేడాతో బారామతి స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. సుప్రియా సూలే ఇక్కడి నుంచి విజయం సాధించడం ఇది నాలుగోసారి.

    ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురే సుప్రియా. అయతే సునేత్ర పవార్ ఓటమి తర్వాత ఆమె జూన్ 18న రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే వ్యక్తిగతం సుప్రియా సూలేకు మంచి పేరుంది. దీంతో పాటు మహా రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరున్న శరద్ పవార్ బిడ్డ కావడం అదనపు బలం. బారామతి పార్లమెంట్ స్థానంలో సుప్రియా అందరితో కలిసిపోతారనే పేరుంది.

    అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన ఓ ప్రశ్నకు అజిత్ పవార్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ రాఖీ పూర్ణిమకు మీ చెల్లి సుప్రియాను కలుస్తారా అని అడగ్గా, ఆమె ప్రస్తుతం వేరే పర్యటనలో ఉన్నారని, ఒకవేళ ఒకేచోట ఉన్నట్లయితే తప్పకుండా కలుస్తానని చెప్పారు. ఇక అన్న శరద్ పవార్ గురించి మాట్లాడారు. మరాఠీ రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత, అలాంటి వ్యక్తి గురించి బీజేపీ, శివసేన పార్టీలు విమర్శలు చేయడం తగదని చెప్పారు. త్వరలోనే కూటమి నేతలకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తానని తెలిపారు.

    అయితే ఇప్పటికీ, ఎప్పటికీ తమ ఇంటి పెద్ద శరద్ పవార్ మాత్రమేనని చెప్పారు. కేవలం రాజకీయాల్లో విభేదాలు ఉన్నా, కుటుంబపరంగా ఆయన మాటే ఫైనల్ అవతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అజిత్ పవార్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల కొందరు నేతలు తిరిగి శరద్ పవార్ వర్గంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో, అజిత్ పవార్ కూడా తిరిగి బాబాయి వద్దకు చేరాలని అనుకుంటున్నారని చర్చ జోరుగా సాగుతున్నది.