Hydra: హైడ్రా కూల్చినా భయపడట్లే.. మళ్లీ అదే స్థానాల్లో దర్జాగా వ్యాపారాలు..

చెరువులను చెరబట్టి చేపట్టిన నిర్మాణాలవి. నాలాలను ఆక్రమించి కట్టిన భవనాలవి. ఫుల్ ట్యాంక్ లెవెల్ వద్ద కట్టిన బహుళ అంతస్తులవి. ఇన్నాళ్లకు వాటిని హైడ్రా పడగొట్టింది. పడగొట్టినంతవరకే హడావిడి జరిగింది. ఆ తర్వాత కథ మళ్ళీ మొదటికి వచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 30, 2024 8:48 am

Hydra(11)

Follow us on

Hydra: హైదరాబాదులో చెరువుల పరిరక్షణ.. నీటి వనరుల సంరక్షణ హైడ్రా ధ్యేయమని.. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ ఈ పని చేయలేమని హైడ్రా రంగనాథ్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. అక్రమ నిర్మాణాల వెనుక పెద్దలు ఉన్నారు అనేది నిజం. ఆ పెద్దలు రాజకీయ నాయకులనేది నిజం. ఆ పేదల ముసుగులో పెద్దలు చేస్తున్న ప్రయత్నం వల్ల హైడ్రా అనవసరంగా బద్నాం అవుతోంది. ఈ క్రమంలో హైడ్రా కాస్త వెనకడుగు వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మూసి ప్రక్షాళన విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరోవైపు అమీన్పూర్ చెరువు ప్రాంతంలో ఓ నిర్మాణాన్ని ఇటీవల హైడ్రా పడగొట్టింది. ఆ భవన యజమాని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. స్టే ఉండగానే హైడ్రా దానిని పడగొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే హైడ్రా ఇటీవల అనేక అక్రమ నిర్మాణాలను పడగొట్టింది. అందులో బడాబాబులవి, రాజకీయ నాయకులవి ఉన్నాయి. అయితే ఈ నిర్మాణాలను పడగొట్టినప్పటికీ.. మళ్లీ ఆ స్థానాలలో యధావిధిగా వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయి.. మరి దీనికి హైడ్రా ఏ విధంగా చెక్ పెడుతుందో చూడాల్సి ఉంది. హైదరాబాదులో నీటి వనరుల పరిరక్షణ కోసమే హైడ్రా పనిచేస్తుందని చెబుతున్న రంగనాథ్.. వీటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

హైదరాబాదులోని వివిధ నీటి వనరులకు సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కొంతమేర పడగొట్టింది. ఆయనప్పటికీ కొంతమంది అక్రమార్కులు మళ్లీ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల మాదాపూర్ లోని సున్నం చెరువు ప్రాంతంలో వాటర్ ట్యాంకర్ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి అక్రమంగా కట్టడాన్ని నిర్మించాడు. దాన్ని హైడ్రా పడగొట్టింది. అయినప్పటికీ అతడు ఆస్థానంలోనే వ్యాపారం చేస్తూ డబ్బును దండుకుంటున్నాడు. ఇదే విషయాన్ని ఇటీవల రంగనాథ్ ప్రముఖంగా ప్రస్తావించారు.. రామ్ నగర్ లో ఓ వ్యక్తి నాలాను ఆక్రమించి బార్ నిర్మించాడు. దీనిని ఇటీవల హైడ్రా పడగొట్టింది. అయినప్పటికీ అతడు అదే స్థానంలో మళ్ళీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.

ఇది కేవలం వాణిజ్య భవనాల విషయంలోనే కాదు.. అక్రమ నివాసాల విషయంలోనూ చోటు చేసుకుంటున్నది. శాస్త్రి పురం కాలనీలో బం – రుక్న్ – ఉద్ – హౌలా సరస్సు ఫుల్ ట్యాంక్ లెవెల్ వద్ద ఓ నిర్మాణాన్ని ఆగస్టు 10న హైడ్రా పడగొట్టింది. మళ్లీ కొద్ది రోజులకే అక్కడ వ్యాపారాలు మొదలయ్యాయి. ఓ వైపు అక్రమ నిర్మాణాలను హైడ్రా పడగొడుతుంటే.. రోజుల వ్యవధిలోనే మళ్లీ అక్కడ వ్యాపారాలు మొదలవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రా ఇంత పనిచేసి ఉపయోగం ఏముంటుంది? ఇప్పటికే రాష్ట్రంలో అక్రమంగా నిర్మాణాలను చేపట్టిన వారికి కొన్ని పార్టీలు, పత్రికలు అండగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో హైడ్రా మళ్ళీ వారి మీదికి వెళ్తే.. ప్రభుత్వం విమర్శల పాలు కాక తప్పదు. ఇక్కడే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు నారాయణ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన “పులి మీద స్వారీ” వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి.