HomeతెలంగాణBRS: ఎలక్టోరల్ బాండ్స్ పై బీఆర్ఎస్ మౌనం వెనుక.. ఇదీ అసలు సంగతి

BRS: ఎలక్టోరల్ బాండ్స్ పై బీఆర్ఎస్ మౌనం వెనుక.. ఇదీ అసలు సంగతి

BRS: ఎన్నికల బాండ్లపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికార బిజెపిని కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. కానీ ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రశ్నించలేదు. అసలు ఆ విషయం గురించి మాట్లాడలేదు. వాస్తవానికి బిజెపికి వ్యతిరేకంగా ఏ అంశం ఉన్నా ట్విట్టర్ లేదా విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తే కేటీఆర్ సైలెంట్ అయ్యారు.. హరీష్ రావు కూడా అదే విధానాన్ని అనుసరించారు. ఇక మిగతా నాయకులు అదే సూత్రాన్ని పాటించారు. కానీ దీని వెనక అసలు విషయం వేరే ఉంది. ఎందుకంటే ఎన్నికల బాండ్ల ద్వారా భారత రాష్ట్ర సమితి కూడా లబ్ధి పొందింది కాబట్టి. ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు పొందిన నాలుగవ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉంది కాబట్టి..

ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాల్లో బిజెపి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. కాంగ్రెస్, ఇతర పార్టీలను మినహాయిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎన్నికల బాండ్ల విరాళాల జాబితాలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ పార్టీకి మొత్తం 1,322 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో 663 కోట్లు అంటే 50.15 శాతం నిధులు నాలుగు రోజుల్లోనే వచ్చాయి. ఒక రోజైతే ఏకంగా 268 కోట్ల విలువైన బాండ్లు పార్టీకి సమకూరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి సమర్పించిన జాబితా ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

2022, ఏప్రిల్ 12న భారత రాష్ట్ర సమితికి అందిన బాండ్ల విలువ అక్షరాల 268 కోట్లు.. ఒక్కరోజే 268 కోట్లు రావడం పట్ల రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యమే వ్యక్తం చేస్తున్నారు. 2023 జూలై 13న 218 కోట్లు, 2022 ఏప్రిల్ 11న 92 కోట్లు, 2021 అక్టోబర్ 8న 85 కోట్లు భారత రాష్ట్ర సమితికి విరాళాలుగా వచ్చాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చినవే. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ ద్వారా భారత రాష్ట్ర సమితికి 201 కోట్ల విలువైన బాండ్లు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఐటిసి, ఆర్థికపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రహేజా, కోవిడ్ సమయంలో తీవ్ర విమర్శల పాలైన యశోద ఆసుపత్రి, సిద్దిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రాజ్ పుష్ప ఎసెట్ వంటి సంస్థలు భారత రాష్ట్ర సమితికి బాండ్ల రూపంలో భారీగా విరాళాలు ఇచ్చాయి.

ఇక క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్.. ఫ్యూచర్ గేమింగ్, మేఘా ఇంజనీరింగ్ సంస్థల తర్వాత అత్యధికంగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తో ఈ సంస్థకు సంబంధాలు ఉన్నాయి. 2021-22, 2023-24 మధ్య మొత్తం 410 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను ఈ సంస్థకు కొనుగోలు చేసింది. అయితే వాటిని కేవలం రెండు పార్టీలకు మాత్రమే ఇచ్చింది. ఆ రెండు పార్టీల్లో ఒకటి బిజెపి, మరొకటి శివసేన. తాను కొనుగోలు చేసిన 385 కోట్ల ఎన్నికల బాండ్లను బిజెపికి, మిగతా 25 కోట్ల బాండ్లను శివసేనకు ఆ సంస్థ ఇచ్చింది. క్విక్ సప్లై మాదిరి హనీ వెల్ ప్రాపర్టీస్ అనే సంస్థ కూడా రిలయన్స్ కంపెనీతో సంబంధాలు నడుపుతోంది. 2021 ఏప్రిల్ 8న మొత్తం 30 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. వాటిని బిజెపికి అందజేసింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి క్విక్ సప్లై సంస్థ నికరలాభంగా 21.7 కోట్లు ఆర్జించినట్టు ప్రకటించింది. కానీ ఆ ఏడాది ఆ కంపెనీ 360 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular