BRS MLAs Arrested: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాదైనా.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. బీఆర్‌ఎస్ నాయకులు ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు సీఎంగా రేవంత్‌రెడ్డి ఉండడం గులాబీ నేతలకు మింగుడు పడడం లేదు. దీంతో అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే రేవంత్ సర్కార్‌పై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఎన్నికల ముందు వరకే రాజకీయాలు ఉండాలి. కానీ, ఎన్నికల తర్వాత కూడా తెలంగాణలో రాజకీయాలే కొనసాగుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టాలని బీఆర్‌ఎస్ నాయకులు నిత్యం ఏదో ఒక అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకతతో బీఆర్‌ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. దీనిని ఆ పార్టీ నేతలు ఇప్పటికీ గుర్తించడం లేదు. కేవలం కాంగ్రెస్ తప్పుడు హామీలతో గెలిచారని భావిస్తున్నారు. దీంతో తాము అధికారంలో ఉన్నా.. ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుండడంతో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు టార్గెట్‌గా ఆరోపణలు చేస్తున్నారు. పదేళ్లలో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెడుతున్నారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసిన నేతలతోపాటు, గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై కేసులు పెడుతున్నారు.
అరెస్టుల పర్వం…
ఏడాదికాలంగా కేసులకే పరిమితమైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అరెస్టులు ప్రారంభించింది. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌషిక్‌రెడ్డిని అరెస్టు చేసింది. పోలీసులను బెదిరించి విధులకు ఆటంకం కలిగించిన కేసులో కౌషిక్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా అప్పటికే కౌషిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి హరీశ్‌రావు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంట్లోకి ఎలా వస్తారు.. అరెస్టు వారెంట్ ఉందా అంటూ నిలదీశారు. దీంతో పోలీసులు కౌషిక్‌రెడ్డికన్నా ముందు.. హరీశ్‌రావును అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కౌషిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఇద్దరిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హరీశ్‌రావును సాయంత్రం 7 గంటల సమయంలో స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
అర్ధరాత్రివరకు స్టేషన్‌లోనే కౌషిక్‌రెడ్డి..
పాడి కౌషిక్‌రెడ్డిని మాత్రం పోలీసులు అర్ధరాత్రి వరకు విడుదల చేయలేదు. అరెస్టు చూపకుండా, కోర్టులో హాజరు పర్చకుండా పోలీసులు తమ అదుపోలనే ఉంచుకోవడంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమైంది. ఉదయమే ఎమ్మెల్యేల అరెస్టుపై పోలీస్ స్టేసన్ల ఎదుట బీఆర్‌ఎస్‌నేతలు ఆందోళన చేశారు. కౌషిక్‌రెడ్డిని విడుదల చేయకపోవడంతో రాత్రి మరోసారి బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో రాస్తారోకో చేశారు. అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించేవారిపై కేసులు పెడుతోందని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో పోలీస్ రాజ్యం తెచ్చారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి అరెస్టులు జరగలేదని, ఇన్ని కేసులు పెట్టలేదని పేర్కొన్నారు. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడమని హెచ్చరించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో..
ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లోనూ బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేశారు. తమ ఎమ్మెల్యేను విడుదల చేయాలని రోడ్లపైకి వచ్చారు. అరెస్టును ఖండించారు. అర్ధరాత్రివరకూ ఆందోళన కొనసాగించారు. ఎమ్మెల్యేను విడుదల చేసిన తర్వాతనే ఆందోళన విరమించారు.