California Earthquake: అగ్రరాజ్యం అమెరికాను కొన్ని రోజులుగా తుఫాన్లు భయపెడుతున్నాయి. భీభత్సం సృష్టిస్తున్నాయి. తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. దీంతో తుఫాను అనగానే అమెరికన్లు వణికిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఐదారు తుఫాన్లతో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. ఈ తరుణంలో తాజాగా భూకంపం భయపెట్టింటింది. అమెరికా పశ్చిమ తీరంలో సముద్రంలో భూకంపం వచ్చింది. భారత కాలమానం ప్రకారం.. 6వ తేదీ అర్ధరాత్రి 12:14 గంటలకు సభవించింది. కాలిఫోర్నియాకు పశ్చిమంగా వచ్చింది. ఆ సమయంలో కాలిఫోర్నియాలో సమయం 5వ తేదీ ఉదయం 10:44 నిమిషాలు అయింది.
భారీ తీవ్రత..
తాజాగా అమెరికాలో సంభవించిన భూకంప కేంద్రం సముద్రంలో ఉండగా తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైంది. దీని ప్రభావంతో కాలిఫోర్నియా, ఒరెగాన్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే కాసేపటి తర్వాత ఉప సంహరించుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
వరుస ప్రకంపనలు..
తాజా భూకంపం ప్రభావం ఉత్తర కాలిఫోర్నియా అంతటా కనిపించింది. కాలిఫోర్నియాకు పశ్చిమంగా ఉండే పెట్రోలియాకి 62 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇది భూమికి కిలోమీటరు లోతులో ఏర్పడిందని నిర్ధారించారు. ఇది భూమిపై సంభవించి ఉంటే తీవ్రత ఎక్కువగా ఉండేదని అంచనా వేశారు. సముద్రంలో రావడంతో ప్రకంపనల తీవ్రత తగ్గిందని వెల్లడించారు. అయితే ఈ భూకంపం తర్వాత 20 సార్లు ప్రకంపనలు వచ్చాయి. అయితీ తీవ్రత 2.5, అంతకన్నా తక్కువగా రిక్టర్ స్కేల్‌పై నమోదయ్యాయి.
ఊగిపోయిన భవనాలు..
భూకంపం ప్రభావంతో పలు నగరాల్లో భవనాలు ఊగిపోయాయి. దీంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. సీసీకెమెరాల్లో భూ ప్రకంపనల దృశ్యాలు నమోదయ్యాయి. అయితే ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.