Karimnagar Mayar : గత పదేళ్లల్లో తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. కమ్యూనిస్టు పార్టీ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ వరకు ఏ పార్టీని కూడా భారత రాష్ట్ర సమితి నాయకులు వదలలేదు. పైగా ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీని తమలో విలీనం చేసుకున్నారు. ప్రశ్నించే గొంతు లేకుండా చూసుకున్నారు. చివరికి పురపాలక ఎన్నికల్లో కూడా ఏకపక్ష ఫలితాలు వచ్చేందుకు అన్ని రకాల మార్గాలను అనుసరించారు. ఇంత చేసినప్పటికీ తమ పార్టీకి పీఠం దక్కనిచోట సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. అంగ బలం, అర్థ బలం ఉపయోగించి రాజకీయాలను గులాబీమయంగా మార్చారు. కాలం అంతా ఒకే రకంగా ఉంటుందనే భ్రమలో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కానీ చివరికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. గత ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి కాస్త ప్రతిపక్ష స్థానానికి పరిమితం చేశారు. దీంతో నాడు భారత రాష్ట్ర సమితి పురపాలక ఎన్నికల్లో చేసిన అధికార దుర్వినియోగాన్ని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ బయటపెడుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీకి ప్రధాన ఆయువుపట్టైన కరీంనగర్ నగరపాలకంపై కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీనికంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఒక పాచికను వేసింది. అది కాస్త కాగల కార్యం గంధర్వులు తీర్చిన సామెతను నిజం చేసి చూపిస్తోంది.
కేటీఆర్ ఏరి కోరి చేసినప్పటికీ..
కరీంనగర్ నగరపాలక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి మెజారిటీ సాధించింది. ఆ సమయంలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు గులాబీ పార్టీ వారికి దక్కాయి. మేయర్ గా సునీల్ రాకు అవకాశం లభించింది. డిప్యూటీ మేయర్ గా చల్ల స్వరూపా రాణిని నియమించారు. సునీల్ రావు ఎన్నికపై అప్పట్లో వ్యతిరేకత వ్యక్తం అయింది. స్వయంగా కేటీఆర్ జోక్యం చేసుకోవడంతో అందరూ నిశ్శబ్దం అయిపోయారు. దీంతో నాలుగున్నర సంవత్సరాలు పాటుగా అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ.. అవి బయటపడకుండా భారత రాష్ట్ర సమితి కవర్ చేసింది..
భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత..
రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత కరీంనగర్ మేయర్ తన వ్యవహార శైలి పూర్తిగా మార్చుకున్నారు. సునీల్ రావు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే ఆయన అమెరికా వెళ్లేందుకు టికెట్ కొనుగోలు చేశారు. నెలపాటు అమెరికాలో ఉండేందుకు ఆయన ప్రణాళికల రూపొందించుకున్నారు.. అయితే తనకు ఇన్చార్జి మేయర్ బాధ్యతలు ఇవ్వాలని డిప్యూటీ మేయర్ సునీల్ రావు ను కోరారు. సమాచారం ఇవ్వకుండా మేయర్ విదేశీ పర్యటనకు ఎలా వెళ్తారని ఆమె ప్రశ్నించారు. ఇదే క్రమంలో కలెక్టర్, నగర పాలక కమిషనర్ కు పలువురు కార్పొరేటర్ తో కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మేయర్ సునీల్ రావు స్పందించారు. నెల కాదని, 15 రోజులు మాత్రమే అమెరికాలో ఉంటానని.. ఇదిగో గ్రూప్స్ అంటూ టికెట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 6న కరీంనగర్ తిరిగి వస్తానని ఆయన ప్రకటించారు. డిప్యూటీ మేయర్ వ్యవహరిస్తున్న తీరును అతను తప్పు పట్టారు. ఇదే సమయంలో తన బీసీ మహిళను కావడంతోనే ఇన్ ఛార్జ్ మేయర్ బాధ్యతలు అప్పగించలేదని స్వరూప రాణి ఆరోపించారు. దీంతో సునీల్ రావు అమెరికా నుంచి ఒక వీడియో విడుదల చేశారు. పురపాలక చట్టం ప్రకారమే తాను అమెరికా వెళ్లానని, డిప్యూటీ మేయర్, ఇతర కార్పొరేటర్లు తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పట్లో సునీల్ రావుకు పదవి ఇప్పించడంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలకపాత్ర పోషించారు. కేటీఆర్ ను ఒప్పించడంలో వారు విజయవంతమయ్యారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆదరించిన జిల్లాలో ఇంత జరుగుతున్నప్పటికీ అటు గంగుల కమలాకర్, ఇటు వినోద్ రావు స్పందించకపోవడం విశేషం.