BRS: క్షవరం అయితే కాని వివరం అర్థం కాదు. ప్రస్తుతం ఈ నానుడి భారత రాష్ట్ర సమితికి అర్థమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కాకుండా ప్రతిపక్షాల మీద భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శలు చేసేవారు. తమ మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామని.. మేము ఏం చేసినా ప్రతిపక్షాలు సైలెంట్ గా ఉండాలని.. ఎటువంటి మాటలు మాట్లాడకూడదని.. అనే సంకేతాలు ఇచ్చారు. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టారు. ధర్నా చౌక్ లేకుండా చేశారు. ఎన్నికల ముందు తలుపులు బద్దలు కొట్టి ప్రతిపక్ష నాయకులను అడ్డగోలుగా అరెస్టు చేశారు. చిన్న వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని రకరకాల కేసులు పెట్టారు. పోలీసులతో వేధింపులకు గురి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ 10 సంవత్సరాలలో ఎలాంటివి చేయకూడదో.. అలాంటివి చేశారు..
అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ప్రతి సభలోనూ భారత రాష్ట్ర సమితి నాయకులు స్థాయికి మించి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తే కనీసం ఆహ్వానం కూడా పలకకపోయేవారు. పైగా వివిధ రూపాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, నల్ల టీ షర్టులు వేసుకొని నిరసనలు తెలిపేవారు.. తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. సొంత మీడియాలో అడ్డగోలుగా రాతలు రాయించేవారు.. మేధావుల ముసుగులో ఉన్న కొంతమంది పార్టీ కార్యకర్తలతో విద్వేషాలను రగిలించే మాటలు మాట్లాడించేవారు. ఇలా పదేళ్లపాటు అప్రతిహతంగా సాగిపోయిన వారి వ్యవహారానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ద్వారా బ్రేకులు పడ్డాయి. ఇక అప్పటినుంచి గత అధికార పార్టీకి అసలు తత్వం బోధపడుతోంది.
ఇటీవల భారత రాష్ట్ర సమితి చెందిన కీలక నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఎంపీ స్థానంలో నిలబడిన అభ్యర్థి కూడా.. పోటీ చేయబోనంటూ లేఖ రాయడం.. పార్టీలో పెరిగిపోయిన కుంభకోణాలను, అక్రమాలను ప్రస్తావించడం భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని షాక్.. ఇన్ని పరిణామాల తర్వాత ఆ పార్టీ నేతలకు తత్వం బోధపడినట్టుంది. నూరు గొడ్లు తిన్న రాబంధు శాంతి వచనాలు వల్లించినట్టు.. భారత రాష్ట్ర సమితి నాయకులు నీతి వాక్యాలు చెబుతున్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలను చీల్చిన భారత రాష్ట్ర సమితి నాయకులు.. ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు. అధికారం శాశ్వతం కాదు అంటూ సూక్తి వచనాలు వల్లిస్తున్నారు. కానీ ఇక్కడే వారు మర్చిపోయింది ఏంటంటే.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్షాలను ఎలా ఇబ్బంది పెట్టింది..కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ పిల్లర్లు ఎలా కుంగింది.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు ఎలా లీక్ అయింది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘనతలున్నాయి. వాటన్నింటినీ ఇప్పుడప్పుడే తెలంగాణ ప్రజలు మర్చిపోయే పరిస్థితిల్లో లేరు.