HomeతెలంగాణBRS: ప్రజాస్వామ్యంతో పెట్టుకుంటే అంతే.. ఓడలు బండ్లు అయితయ్‌!

BRS: ప్రజాస్వామ్యంతో పెట్టుకుంటే అంతే.. ఓడలు బండ్లు అయితయ్‌!

BRS: అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. పాలకులను ఎన్నుకునేది ప్రజలే. వారు ఎవరికి అధికాం ఇస్తే వాళ్లే కింగ్‌ అవుతారు. వాళ్లను తక్కువగా అంచనా వేస్తే పాతాళానికి తొక్కేస్తారు. చరిత్రలో అలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ తమకు తిరుగులేదని భావించింది. తాము రాజులం ప్రజలు బానిసలు అన్నట్లుగా వ్యవహరించింది. దీంతో 2023 ఎన్నికల్లో ప్రజల దెబ్బకు గద్దె దిగింది. ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రజలతో ఆటలాడుకుంటే ఎలా ఉంటుందో బీఆర్‌ఎస్‌కు రుచి చూపించారు తెలంగాణ ఓటర్లు.

ఓ వెలుగు వెలిగి..
తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌(టీఈఆర్‌ఎస్‌)కు ప్రజల్లో మంచి క్రేజ్‌ ఉండేది. నాడు ఉద్యమ సారథిగా కేసీఆర్‌ ఎవరిని నిలబెట్టినా ప్రజలు గెలిపించేవాళ్లు. కేవలం కారు గుర్తును చూసి ఓటు వేసేవారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు అధికారం కట్టబెట్టారు. పదేళ్లు పాలించిన గులాబీ నేతల్లో అహంకారం తలకెక్కింది. ప్రజలు చెప్పినట్లు తాము వినడం కాదు.. ప్రజలే తాము చెప్పినట్లు వినాలి అన్నట్లు వ్యవహరించారు. తాము ప్రభువులం.. ప్రజలు బానిసలు అన్నట్లు పాలన సాగించారు. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటతో ఆ అహంకారాన్ని నేలకు దించారు.

ఇప్పుడు అభ్యర్థులు కరువు..
ఇక బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి అనే సామెత బీఆర్‌ఎస్‌ విషయంలో నిజమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాంతీయ పార్టీని బలపర్చిన తెలంగాణ ప్రజలు.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆదరించి అధికారంలోకి తెచ్చారు. కానీ పదేళ్ల పాలన తర్వాత పార్టీనేతల అహంకారం చూసి ఓటుహక్కుతో తీసి బండకేసి కొట్టారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు అభ్యర్థులు దొరకడం లేదు. ఇప్పటికే పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, జహీరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీలు పార్టీని వీడారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పోటీకి నిరాకరించారు. మహబూబ్‌నగర ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి కూడా పోటీకి విముఖత చూపుతున్నారు. అయినా అక్కడ అభ్యర్థి లేకపోవడంతో బతిమిలాడి మరీ టికెట్‌ ఇచ్చారు.

ఎన్నడూ లేని గడ్డు పరిస్థితి..
బీఆర్‌ఎస్‌ ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను వెతుక్కుంటోంది. బతిమాలుతోంది. అయినా ఎవరూ ముందుకు రావడం లేదు. చేవెళ్ల నుంచి ఖమ్మం వరకు, ఆదిలాబాద్‌ నుంచి నల్లగొండ వరకూ ఆ పార్టీ తరఫున పోటీచేసే నాయకులే కరువయ్యారు. దీంతో విధిలేక బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీకి రెండు మూడు టికెట్లు ఇవ్వాలని గులాబీ బాస్‌ భావిస్తున్నారు.

రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం జాలా కష్టం. అధికారంలో ఉన్నామని అహంకారంతో విర్రవీగితే పాతాళానికి తొక్కేస్తారు. చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలో బీఆర్‌ఎస్‌ కూడా చేరింది. అయితే కొన్ని పార్టీలు ఉనికిలో లేకుండా పోయాయి. అలాంటి పరిస్థితి బీఆర్‌ఎస్‌కు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ పెద్దలపై ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version