TDP Janasena BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పొత్తు పొడవడం ఖాయమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడానికి కమలనాథులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే టిక్కెట్లపై స్పష్టత రాలేదు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనే అంశంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. శనివారం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఎంపీ సీట్లపై బీజేపీ పట్టు..
ఏపీలో ఎక్కువ ఎంపీ సీట్లు కావాలని బీజేపీ పట్టుపడుతోంది. ఎమ్మెల్యే సీట్లపై పట్టువిడుపు ధోరణిలో ఉన్నా.. ఎంపీ స్థానాలపై మాత్రం గట్టిగా నిలబడుతోంది. దీంతో టీడీపీ దిగిరాక తప్పలేదు. జనసేనకు ఇచ్చే సీట్లను తగ్గించి బీజేపీ అడిగిన స్థానాలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేనకు 3 ఎంపీ స్థానాలు, బీజేపీకి 5 నుంచి 6 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంత వరకు ఓకే అయినా.. ఏయే స్థానాలు ఇవ్వాలనే విషయంలోనూ మళ్లీ సందిగ్ధం నెలకొంది. శనివారం స్థానాలపైనా క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.
జనసేన త్యాగం..
బీజేపీతో పొత్తు కోసం జనసేన త్యాగానికి సిద్ధమైంది. తమకు ఇచ్చిన స్థానాలను వదులుకోవడానికి అంగీకించింది. బీజేపీ కూటమిలో ఉంటే ఏపీలో ఎన్నికలు నిస్పక్షపాతంగా జరుగుతాయని జనసేన భావిస్తోంది. అందుకే బీజేపీకి ఏపీలో బలం లేకపోయినా ఎక్కువ సీట్లు ఇవ్వడానికి టీడీపీ, జనసేన కాంప్రమైజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత కూడా ఏపీలో ప్రభుత్వం సాఫీగా సాగాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి. కేంద్ర ప్రాజెక్టులతోపాటు ఇప్పటి వరకు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి ఆదాయం సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రంతో సఖ్యతగా ఉండడమే మంచిదని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి.
వైసీపీ ఓటమికి సహకారం..
మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడానికి కూడా కేంద్రంలోని బీజేపీ సహకారం అవసరం అని టీడీపీ, జనసేన పార్టీలు భావిస్తున్నాయి. కేంద్రంలో ఈసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిచండం లేదు. ఈ క్రమంలో బీజేపీతో కయ్యం పెట్టుకుంటే నష్టం జరుగుతుందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే బీజేపీ డిమాండ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి నెలకొందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ పొత్తు ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.