BRS: ఇండియా కూటమిలోకి బీఆర్ఎస్..ఓహో అంత కథ నడిచిందా?

రాజకీయంగా భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. కీలకమైన నేతలు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపించాయి.

Written By: Suresh, Updated On : March 3, 2024 8:50 am
Follow us on

BRS: మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నదే.. రాజకీయాలంటే శాశ్వత శత్రుత్వాలు కాదు అని.. రాజకీయ పార్టీలు వాటి అవసరాల ఆధారంగానే అడుగులు వేస్తాయని.. ఇందులో ఏ పార్టీ కూడా శుద్ధ పూస కాదు.. ఏ రాజకీయ నాయకుడు కూడా రాఘవేంద్ర మఠం సన్యాసి కాదు.. కాకపోతే అవకాశాల ఆధారంగా అడుగులు వేసే పార్టీలకే అధికారం దక్కుతుంది. అలా అడుగులు వేయని పార్టీకి అధికారం దూరమవుతుంది.. ప్రస్తుతం తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఇదే పరిస్థితిని చవి చూస్తోంది. ఓ వైపు రేవంత్ రెడ్డి పాలన పరంగా తన మార్క్ చూపిస్తున్నాడు. అప్పటి భారత రాష్ట్ర సమితి విధానాల మీద ఫుల్ గా పోకస్ చేస్తున్నాడు. కేసీఆర్ ను ఇరుకున పెడుతున్నాడు. ఇలాంటి సమయంలో పార్టీని కాపాడుకోవడం కేసీఆర్ కు అత్యంత ముఖ్యం. అందుకే కేసీఆర్ రాజ్య సభ సభ్యుడు కే. కేశవ రావు ద్వారా ఒక స్కెచ్ వేశాడు. కాకపోతే రేవంత్ ఎంట్రీ తో ఒక్కసారిగా బెడిసి కొట్టింది.

రాజకీయంగా భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. కీలకమైన నేతలు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపించాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి భారత రాష్ట్ర సమితి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. ఇలాంటి తరుణంలో పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో కొంత సత్తా చాటాలి. అన్నింటికీ మించి రాజకీయంగా కొత్త శక్తిని సంతరించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కొంత బలాన్ని సంపాదించుకోవాలి. ఇవన్నీ జరగాలంటే భారత రాష్ట్ర సమితి ఇండియా కూటమిలో ఉండటమే శ్రేయస్కరమని కెసిఆర్ భావించారు. గతంలో కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు కేశవరావు రంగంలోకి దింపాడు. రాహుల్ గాంధీకి వర్తమానం పంపాడు. కానీ ఈలోగా విషయం తెలిసి రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యాడు.

తనకున్న కమ్యూనిస్టు నాయకులతో రాహుల్ గాంధీకి కేశవరావు వర్తమానం పంపాడు. భారత రాష్ట్ర సమితి ఇండియా కూటమిలో చేర్చుతామని సంకేతాలు ఇచ్చాడు. కానీ ఈలోగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిశాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి భారత రాష్ట్ర సమితిని చేర్చుకోవద్దని.. అలా అయితే తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేరే విధంగా మారిపోతాయని వివరించాడు. దీంతో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పినట్టే చేశారు. దీంతో కేశవరావు ప్రయత్నాలకు గండిపడింది. ఇండియా కూటమిలో భారత రాష్ట్ర సమితి చేరే ప్రయత్నం ఆగిపోయింది. సాధారణంగా రాజకీయాలలో కేసీఆర్ ను చాలామంది అపర చాణక్యుడు అంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అలాంటి పేరును గడిస్తున్నారు.. మున్ముందు ఏం జరుగుతుందో తెలియదు గానీ.. ప్రస్తుతానికి అయితే కేసీఆర్ మీద రేవంత్ పై చేయి సాధించారు. మరి దీనికి కెసిఆర్ ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.