BRS: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)కు జన్మస్థానంలోనే ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అసెంబ్లీ ఎన్నిల్లో ఓటమి తర్వాత ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవచ్చని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అధినేత గుర్తించారు. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు.. పార్టీ పతారను పక్క రాష్ట్రం మహారాష్ట్రలో చూపెట్టడంపై దృష్టిపెట్టారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పరిస్థితిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
నాలుగు నెలల్లో ‘మహా’ ఎన్నిలు..
మహారాష్ట్రలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమతి.. వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. తెలుగు వారు ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయడానికి కసరత్తు చేస్తోంది.
టార్గెట్ ‘మహా’ అసెంబ్లీ..
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కూడా మొదలు కానుంది. అయితే, బీఆర్‌ఎస్ వీటిపై కాకుండా అసెంబ్లీ స్థానాలపైనే దృష్టి పెట్టాలని భావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే మహారాష్ట్రలో పార్టీ విస్తరణ చేపట్టిన గులాబీ బాస్ అక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా ప్రారంభించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత, లోక్‌సభ ఎన్నికల ముందు ఆ నేతలంతా తమదారి తాము చూసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్ పోటీ చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే.. మళ్లీ కొత్త నేతలు వస్తారని కేసీఆర్ భావిస్తున్నారు.
గులాబీ శ్రేణుల్లో గందరగోళం..
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దలు.. బీఆర్‌ఎస్ పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇంట ఓడిపోయి.. రచ్చ గెలవాలని చూస్తున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. గులాబీ బాస్ తీరుతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ భవిష్యత్ ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలో కేసీఆర్ మహారాష్ట్రపై దృష్టిపెట్టడం, అక్కడ సత్తా చాటాలని పాకులాడడంపై గుసగుసలాడుతున్నారు. కేసీఆర్ తీరుతో తెలంగాణలో పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదని పేర్కొంటున్నారు. అయితే కొందరు మహారాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడం వెనక ఏదో ఎత్తుగడ ఉండే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. షిండే సార్కర్‌కు మద్దతుగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే కేసీఆర్ మహారాష్ట్రపై దృష్టిపెట్టారని ప్రచారం జరుగుతోంది.