BRS: దేశంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వద్ద కోట్ల విరాళాలు ఉన్నాయి. ఎందుకంటే అవి జాతీయ పార్టీలు కాబట్టి వాటికి వచ్చేరాల సంఖ్య కూడా ఎక్కేవ. కానీ.. అత్యధిక విరాళాలు, నిధుల రూపంలో సేకరించిన సొమ్ములో మొదటి స్థానంలో ఉన్న ప్రాంతీయ పార్టీ గురించి తెలుసా..? ఎవరైనా ఆ పార్టీ గురించి ఊహించగలరా..? ఈ కోటాలో ఏ ఉత్తరాది పార్టీ చేరిందనుకుంటే పొరబడినట్లే. అత్యధిక నిధులను సేకరించిన పార్టీగా తెలంగాణకు చెందిన పార్టీ నిలవడం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల కంటే చాలా ఎక్కువగా నిధులను సేకరించి బీఆర్ఎస్ పార్టీ టాప్ ప్లేసులో నిలిచింది.
బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా భారత ఎన్నికల సంఘానికి తెలిపిన ఆడిట్‌లోనే ఈ లెక్క కనిపించింది. ఈ విషయం ఇప్పడు తెలుగు రాష్ట్రాలతోపాటు మిగితా రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి దరిదాపుల్లో కూడా లేవు. పార్టీలు సేకరిస్తునన్ నిధులు, ఖర్చల వివరాలను ఏటా భారత ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులోభాగంగా గత లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చుల వివరాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అన్ని పార్టీలు తమ నిధులు, ఖర్చుల వివరాలను అందజేశాయి. ఆయా పార్టీలు అందించిన ఆడిట్ నివేదికలను ఈసీ పరిశీలించింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మేరకు పబ్లిష్ చేసింది. దాని ప్రకారమే బీఆర్ఎస్ అత్యధిక ధనిక ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఇప్పుడు ఆ పార్టీ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.1,449 కోట్ల నిధులు ఉన్నాయి.
బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ కూడా దరిదాపుల్లో కూడా లేదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం అయ్యే సరికి బీఆర్ఎస్ ఖాతాల్లో రూ.1,19 కోట్లు ఉన్నాయని వెల్లడించింది. ఎన్నికల ప్రకటన ముగిసే లోగా మరో రూ.47.56 కోట్లు విరాళాలు వచ్చాయి. మరోవైపు.. ఎన్నికల్లో ప్రచార ఖర్చుల కోసం రూ.120 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు పార్టీ నివేదికలో పేర్కొంది. ఎన్నికల ప్రచార సామగ్రి నిమిత్తం రూ.34.68 కోట్లు, బహిరంగ సభలతో ఊరేగింపులు, ర్యాలీల కోసం రూ.20.37 కోట్లు బీఆర్ఎస్ వెచ్చించింది. ఇతరత్రా ప్రచారం కోసం రూ.34.39 కోట్లు వ్యయం చేసినట్లు ఈసీకి తెలిపింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లోని అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.95 లక్షల చొప్పున రూ.16.15 కోట్లను నేరుగా చెక్/డీడీ ద్వారా ఇచ్చినట్లు పేర్కొంది. అభ్యర్థుల నేరచరిత్రపై ప్రకటనలు ఇచ్చేందుకు రూ.73.17 లక్షలు వెచ్చించినట్లు బీఆర్ఎస్ వెల్లడించింది. ఈ లెక్కలను చూస్తుంటే పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పార్టీ ఫండ్‌ను బాగానే వెనకేసిందని అర్థం చేసుకోక తప్పదు. పలు కాంట్రాక్ట్ కంపెనీలు బీఆర్ఎస్‌కు పెద్దఎత్తున విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సారి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పరిస్థితిని చూస్తే రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మాత్రం వామ్మో అన్ని కోట్లా అని నోరెళ్లబెట్టక తప్పదు.