https://oktelugu.com/

Karimnagar: ‘ఎంపీ’ సర్వే : ఆ బీఆర్ఎస్‌కు అసలు ఊపే లేదట?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న గులాబీ నేతల్లో ధైర్యం నింపేందుకు, లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు కేటీఆర్‌ ఇటీవలే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 30, 2024 / 01:35 PM IST
    Follow us on

    Karimnagar: లోక్‌సభ ఎన్నికలకు ముందే.. బీఆర్‌ఎస్‌ చేతులు ఎత్తేయబోతుందా.. సొంత సర్వే ఫలితాలు గులాబీ నేతలకు షాక్‌ ఇస్తున్నాయా.. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఉనికే ప్రశ్నార్థకం కానుందా అంటే అవుననే సమాధానం వస్తుంది పొలిటికల్‌ సర్కిల్స్ నుంచి.. కారు తాత్కాలిక మరమ్మతుకు వచ్చిందని… షెడ్డులో రిపేర్‌ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో వంద స్పీడ్‌తో దూసుకెళ్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట తారకరామారావు క్యాడర్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ సొంతంగా చేస్తున్న సర్వే ఫలితాలు గులాబీ నేతలకు ముళ్లులా గుచ్చుకుంటున్నాయి. దీంతో ఎన్నికలకు ముందే.. గులాబీ పార్టీకి చెందిన చాలా మంది నేతలు కారు దిగుతారన్న ప్రచారం జరుగుతోంది.

    కరీంనగర్‌లో మళ్లీ కాషాయ జెండానే..
    అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న గులాబీ నేతల్లో ధైర్యం నింపేందుకు, లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు కేటీఆర్‌ ఇటీవలే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. తెలంగాణ బలం, గలం బీఆర్‌ఎస్‌ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ ఉంటేనే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుందని, మన బలం, గళం వినిపించాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పెద్దపెద్ద డైలాగ్స్‌ కొడుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్‌ మీడియా కారణంగానే ఓడిపోయామని చెబుతున్న కేటీఆర్‌ ఆ విభాగాన్ని కూడా పటిష్టం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సోషల్‌ మీడియా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కరీంనగర్, సిరిసిల్లలో మీటింగులు పెట్టారు. బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ప్రకటించారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వినోద్‌కుమార్‌ ఏం తెచ్చాడు, ప్రస్తుత ఎంపీ సంజయ్‌ ఏం తెచ్చాడు. ఎన్ని ప్రశ్నలు అడిగాడని వివరించారు. కానీ, ఇవన్నీ క్యాడర్‌లో ఉత్సాహం నింపాయి. ప్రజల నాడిని మాత్రం మార్చలేదు. బీజేపీలో మళ్లీ కాషాయ జెండానే ఎగురబోతుందని బీఆర్‌ఎస్‌ సర్వేలోనే తేలింది.

    ‘‘బీఆర్ఎస్ అనుకూల మీడియా సర్వే..
    తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి ఏమిటన్న కోణంలో   ఆ పార్టీకి చెందిన అనుకూల మీడియా ప్రతినిధులతో సర్వే చేయిస్తున్నారు. ఒక్కో ప్రతినిధి 20 మందిని సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌లో నిర్వహించిన సర్వే పూర్తయింది. ఈ సర్వే ఫలితాలు చూసి కేటీఆర్‌ దిమ్మతిరిగిందట. 20 మందిలో 17 మంది బీజేపీకే ఓటు వేస్తామని చెప్పారట. ఇద్దరు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వగా కేవలం ఒక్కరు మాత్రమే బీఆర్‌ఎస్‌కు ఓటేస్తామని తెలిపారు.

    మూడోస్థానంలో బీఆర్‌ఎస్‌..
    ఆ మీడియా నిర్వహించిన సర్వేలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ గ్రాండ్‌ విక్టరీ ఖాయం. ఇక రెండు, మూడో స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు ఇప్పటి వరకు అభ్యర్థి లేడు. గతంలో పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్‌ నుంచి పోటీచేసి గెలిచారు. ఈసారి జీవన్‌రెడ్డి, లేదా పురుమళ్ల శ్రీనివాస్‌ను దించే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్థి ఎవరు ఉన్నా.. పార్టీ పరంగా నిర్వహించిన సర్వేలో 90 శాంత మంది బీజేపీకే ఓటేస్తామని తెలుపడం గమనార్హం.