BJP President Ramachandra Rao: రామచంద్రరావు.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. తొలి ప్రసంగాన్ని ఆయన అదరగొట్టారు. సౌమ్యుడని.. మితభాషి అని.. వివాదాలలో తల దూర్చరని పేరుపొందిన ఆయన.. వాటికి భిన్నంగా వ్యవహరించారు. తొలి ప్రసంగంలోనే తాను ఏంటో చెప్పేశారు. తనను తక్కువ అంచనా వేయవద్దని.. తను ఊర మాస్ అని స్పష్టం చేశారు. చొక్కా కు ఉన్న గుండీలు మొత్తం విప్పుకొని తిరిగితేనే పోరాటం కాదని.. తన అగ్రి సివ్ నెస్ వేరే విధంగా ఉంటుందని రామచంద్ర రావు వెల్లడించారు.
“అందరూ నన్ను సౌమ్యుడు అంటారు. మితభాషి అని కూడా పిలుస్తుంటారు. కానీ నేను అలా కాదు. విద్యార్థులతో కలిసి 14 సార్లు జైలుకు వెళ్లొచ్చాను. నక్సలైట్లను అరెస్టు చేయాలని పోరాడుతున్న సమయంలో నా చేయి విరిగింది. నా కాలు కూడా విరిగిపోయింది. ఇప్పటికే నేను కుంటుకుంటూనే నడుస్తుంటాను. దానికి కారణం ఏమిటో చాలామందికి తెలుసు. ఒకప్పుడు నేను ఏం చేశానో.. ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అధిష్టాన నామీద ఒక బాధ్యతను పెట్టింది. ఆ బాధ్యతను నేను నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే తప్ప ఎవరో ఏదో అనుకున్నారని.. ఎవరో ఏదో అనుకుంటున్నారని బాధపడి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. అధిష్టానం విధించిన టార్గెట్ కూడా ఉంది. ఆ రెండిటిని నేను రీచ్ కావాల్సి ఉంటుంది. దానికోసం మీ అందరి సహకారం కావాలి. మన అందరి లక్ష్యం భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం.. దానికోసం శ్రమిద్దామని” రామచంద్రరావు వ్యాఖ్యానించారు.
“యుద్ధానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇప్పుడే కత్తి బయటకు తీశాను. యుద్ధం ఎలా చేయాలో నాకు ఒక అవగాహన ఉంది. సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉంది. అని అంశాల మీద పట్టుంది. అలాంటప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని నేను కింద పడేయలేను. కిందపడేసి అపకీర్తి తెచ్చుకోలేను. భారతీయ జనతా పార్టీకి బలమైన కార్యవర్గం ఉంది. అదే స్థాయిలో నాయకత్వం కూడా ఉంది.. కార్యవర్గాన్ని, నాయకత్వాన్ని సమన్వయం చేసుకొని ప్రయాణం సాగిస్తాను. ఈ ప్రయాణంలో అందరి భాగస్వామ్యం అవసరం. అందరి తోడ్పాటు కూడా అవసరం. చట్టసభలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. నాటి కాలంలోనే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన నేర్పరితనం నాకుంది. సమస్యలపై పోరాడే ధైర్యం నాకుంది కాబట్టే 14 సార్లు జైలుకు వెళ్లి వచ్చాను. కాలు చేయి కూడా విరగొట్టుకున్నాను. పోరాటం నాకు కొత్త కాదు. పోరాడే తత్వం నాలో తగ్గిపోలేదు.. యుద్ధానికి నేను సిద్ధంగానే ఉన్నాను అంటూ” రామచంద్రరావు వ్యాఖ్యానించారు.
రామచంద్రరావు నియామకాన్ని రాజాసింగ్ వ్యతిరేకించారు. బిజెపికి రాజీనామా చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. తనకు వ్యక్తిగత పనులు ఉన్నందువల్ల హాజరు కాలేకపోతున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. తొలి స్పీచ్ లోనే రామచంద్రరావు అదరగొట్టిన నేపథ్యంలో.. ఆయన తెలంగాణ అధ్యక్షుడిగా ఎలా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది.