CM Revanth Reddy: బిజెపికి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సచివాలయంలో భేటీ అవ్వడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి,ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి,ముధోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ ఆదివారం రేవంత్ ను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహణకై ఈసీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుండగా.. ఈ ముగ్గుకు ఆయనతో భేటీ అయ్యారు. పలు రైతు సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ కు రిప్రెసెంటేషన్ ఇచ్చారు.
అయితే పైకి ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని రైతు సమస్యల పరిష్కారం కోసం కలిసినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికిని అంతర్గతంగా మాత్రం రాజకీయ వర్గాల్లో మరో రకమైన డిస్కషన్ నడుస్తుంది. బిజెపికి సంబంధించిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు గతంలో కాంగ్రెస్తో అవినాభావ సంబంధం ఉంది. బిజెపి శాసనసభా నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎన్నికలకు ఆరు నెలల ముందు కాంగ్రెస్ నుంచి బిజెపి పార్టీలో జాయిన్ అయి నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అందువల్ల ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులతో కూడా నిరంతరం టచ్ లో ఉంటారనే ప్రచారం ఉంది. ఇక మరో ఎమ్మెల్యే రామారావు పటేల్ కు కూడా ఇదే నేపథ్యముంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గతంలో రాజకీయంగా అంతగా ఆక్టివ్ గా లేని వ్యక్తి. కానీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ఆయన ఎప్పుడూ నెగటివ్ గా స్పందించిన సందర్భాలు లేవు.
ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి తో సచివాలయంలో సమావేశం వెనక పార్టీ మార్పు ఉండొచ్చనే చర్చ నడుస్తుంది. వాస్తవానికి రైతు సమస్యలపై గనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిజెపి తరఫున వినతి పత్రాలు అందించాలనుకుంటే.. ఆ పార్టీ శాసనసభ పక్షం హోదాలో ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు అందరికీ సమాచారం ఇవ్వాల్సింది. అలా కాదనుకుంటే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాసినా సరిపోయేది. కానీ,ఇక్కడ అలా జరగలేదు. టీ-బీజేపీ శాసనసభా పక్ష హోదాలో ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలందరికీ సమాచారం అందించనట్టు తెలుస్తోంది. అందువల్లే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ని కలవడం వెనక పార్టీ మార్పే మెయిన్ రీజన్ అయ్యి ఉంటుందనే డిస్కషన్ జరుగుతోంది.