YCP: జగన్ మాటను విశ్వసించని పందెం రాయుళ్లు

వాస్తవానికి పందేలు చట్ట విరుద్ధం. కానీ ఏపీలో గెలుపోటములపై బహిరంగంగానే బెట్టింగులు సాగుతున్నాయి. ఒక్క భీమవరం కేంద్రంగానే 150 కోట్ల రూపాయల బెట్టింగులు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : May 19, 2024 12:11 pm

YCP

Follow us on

YCP: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జూన్ 4న ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో పోలింగ్ నమోదయింది. దీంతో ఎవరికి వారే ప్రయోజనాలను అన్వయించుకుంటున్నారు. అయితే మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయల పందేలు సాగుతున్నాయి. అధికార వైసిపి కంటే.. కూటమి అధికారంలోకి వస్తుందని అంశంపైనే ఎక్కువ మంది బెట్టింగ్ కాస్తున్నారు. ఒకవేళ కూటమి ఓడిపోతుందని ఎవరైనా పందెం కాసి నెగ్గితే వారికి రూపాయికి నాలుగు రూపాయలు చొప్పున ఇచ్చేందుకు సైతం వెనుకడుగు వేయడం లేదు. అయితే మనం గెలవబోతున్నాం అంటూ సీఎం జగన్ ప్రకటన చేసిన తర్వాత కూడా.. వైసీపీ శ్రేణుల నుంచి ధీమా కనిపించడం లేదు.

వాస్తవానికి పందేలు చట్ట విరుద్ధం. కానీ ఏపీలో గెలుపోటములపై బహిరంగంగానే బెట్టింగులు సాగుతున్నాయి. ఒక్క భీమవరం కేంద్రంగానే 150 కోట్ల రూపాయల బెట్టింగులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ వైసీపీ పై బెట్టింగ్ వేసే వారు తక్కువగా ఉన్నారు. ఆ పార్టీ గెలుస్తుందని ఎవరు ముందుకు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఎక్కువగా బెట్టింగ్ కొనసాగుతోంది. చంద్రబాబు, జగన్, లోకేష్, పవన్, బాలకృష్ణ, రఘురామకృష్ణం రాజు, షర్మిల, కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారి నియోజకవర్గాల విషయంలో.. ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి అంత మెజారిటీ వస్తుంది? అన్నదానిపై బెట్టింగులు కొనసాగుతున్నాయి. అయితే ఏపీలో కూటమికి అనుకూల పవనాలు ఉండడంతో.. ఎక్కువగా వైసీపీకి వ్యతిరేకంగా బెట్టింగులు సాగుతుండడం విశేషం.

అయితే ఈ బెట్టింగ్ల తీరు ఎప్పటికప్పుడు మార్పు వస్తోంది. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఒకలా.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరోలా.. ప్రచారపర్వం ప్రారంభమైన తర్వాత ఇంకోలా.. పోలింగ్ తర్వాత మరోలా బెట్టింగ్ పర్వం కొనసాగడం విశేషం. ఫిబ్రవరి మొదట్లో వైసీపీకి 60 సీట్లు వస్తాయంటూ పందేలు మొదలయ్యాయి. కానీ ప్రచారం ముగిసే సమయానికి ఆ సంఖ్య 75 కు చేరింది. పోలింగ్ తర్వాత 70కి మించి సీట్లు రావని ఎక్కువ మంది బెట్టింగ్ కడుతున్నారు. మరోవైపు కూటమిలో తెలుగుదేశం పార్టీకే 89 నుంచి 92 సీట్లు వస్తాయని.. కూటమికి 104 నుంచి 107 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ శాతం పందేలు కొనసాగుతున్నాయి. గెలుస్తున్నామని జగన్ ప్రకటన తర్వాత కూడా వైసీపీ నుంచి ఆ స్థాయిలో పందేలకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.