Secunderabad Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికపై బీజేపీ కీలక నిర్ణయం

పార్టీ కోసం కష్టపడే వారికి కంటోన్మెంట్‌ టికెట్‌ ఇవ్వాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థిగా ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు భాష పేరు వినిపిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : April 14, 2024 10:51 am

Secunderabad Cantonment Bypoll

Follow us on

Secunderabad Cantonment Bypoll: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక కూడా జరుగనుంది. ఈమేరకు అధికార కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ ఈ సీటుపై కన్నేశాయి. మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ గద్దర్‌ కూతురు వెన్నెలను, బీజేపీ శ్రీగణేశ్‌ను బరిలో దించాయి. ఎన్నికల్లో గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నికల్లో ఈ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్, తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చింది. ఇక లాస్య నందిత దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదితకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఈమేరకు గట్టి అభ్యర్థిని బరిలో దింపేందుకు కసరత్తు చేస్తోంది.

బరిలో కొప్పు భాష..?
పార్టీ కోసం కష్టపడే వారికి కంటోన్మెంట్‌ టికెట్‌ ఇవ్వాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థిగా ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు భాష పేరు వినిపిస్తోంది. భాష దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. రంగారెడ్డి జిల్లా యాచారం ఆయన స్వగ్రామం. చిన్నతనం నుంచి జాతీయ భావాలు కలిగిన నేత. విద్యార్థి ఉద్యమాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. 1999 నుంచి ఏబీవీపీలో చురుకైన విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగి మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థి సమస్యలపై అనేక పోరాటాలు చేసి కేసుల పాలయ్యారు. 2009లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో బీజేవైఎం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2013లో యాచారం గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా..
ఇక 2016 నుంచి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2019లో యాచారం ఎంపీటీసీగా తన భార్యను గెలిపించుకున్నారు. ఇతర పార్టీల నేతలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తున్నారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం అతడిని దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ఇటీవలే ఆయన పదవీకాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు కంటోన్మెంట్‌ టికెట్‌ ఇస్తే గెలుస్తాడని భావిస్తోంది. ఈమేరు భాషతోపాటు, మరో ఇద్దరి పేర్లను కూడా రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ నాయకత్వానికి పంపినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.