PBKS vs RR : ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎదురన్నదే లేకుండా పోతోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఈ జట్టు.. శనివారం రాత్రి పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. తక్కువ స్కోర్ నమోదైన ఈ మ్యాచ్ లో.. రాజస్థాన్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠ గా జరిగింది. ఈ మ్యాచ్ లో అటు పంజాబ్ ఓడిపోవడానికి.. రాజస్థాన్ గెలవడానికి ఒకే ఒక్క ఆటగాడు కారణం. అతడే హిట్మేయర్. ఈ రాజస్థాన్ ఆటగాడు పది బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్స్ లతో 27 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ జట్టును గెలిపించి.. పంజాబ్ జట్టుకు పీడకలను మిగిల్చాడు.
ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి కేవలం 147 రన్స్ మాత్రమే చేసింది. పంజాబ్ ఆటగాడు జితేష్ శర్మ 24 బంతుల్లో 29, అశుతోష్ శర్మ 16 బంతుల్లో ఒక ఫోర్, మోడ్ సిక్స్ లతో 31 పరుగులు చేశారు. వీరు గనక నిలబడకపోయి ఉంటే పంజాబ్ ఆమాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది.. ఇక రాజస్థాన్ బౌలర్లలో ఆవేష్ ఖాన్, కేశవ్ మహారాజ్ రెండేసి వికెట్లు తీశారు. కులదీప్ సేన్, యజువేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ.. రాజస్థాన్ జట్టుకు గెలుపు నల్లేరు మీద నడక కాలేదు. చివరి బంతి వరకు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ 39, హిట్మేయర్ పది బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్స్ లతో 27* రాణించడంతో రాజస్థాన్ విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో రబడా, సామ్ కరణ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్ దీప్ సింగ్, లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
స్వల్ప స్కోర్ కావడంతో రాజస్థాన్ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. మైదానం అత్యంత కఠినంగా ఉండడంతో రాజస్థాన్ ఓపెనర్లు జాగ్రత్తగా ఆడారు. తొలి వికెట్ కు 43 పరుగుల జోడించారు. ఆచితూచి ఆడుతున్న ఓపెనింగ్ జోడిని లివింగ్ స్టోన్ విడగొట్టాడు. ఓపెనర్ తనుష్ కోటియాన్ (24) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆఫ్ సెంచరీ దిశగా వస్తుండగా రబడా అవుట్ చేశాడు. కెప్టెన్ సంజు సాంసన్ ను కూడా రబడా అవుట్ చేశాడు. రియాన్ పరాగ్ (23) ఎదురుదాడికి దిగినప్పటికీ.. అతడిని అర్ష్ దీప్ అవుట్ చేశాడు. ధ్రువ్ జురెల్ ను హర్షల్ పటేల్ వెనక్కి పంపించాడు. దీంతో రాజస్థాన్ జట్టు తీవ్రమైన ఇబ్బందుల్లో పడింది.
రాజస్థాన్ జట్టు విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు అవసరమైన చోట.. కెప్టెన్ సామ్ కరణ్ వేసిన 19 ఓవర్లో పోవెల్ రెండు బౌండరీలు కొట్టాడు. మూడో బంతికి క్యాచ్ అవుట్ అయ్యాడు. కేశవ్ మహారాజ్ ఆ ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 10 పరుగులకు చేరుకుంది. ఈ సమయంలో ఈ సమయంలో హిట్మేయర్ చివరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి రాజస్థాన్ జట్టు విజయాన్ని పరిపూర్ణం చేశాడు.