Lok Sabha Elections 2024: దూకుడు స్వభావం.. ఎవరినైనా ఎదిరించే తత్వం.. హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ బడా కథానాయకుడితో నీళ్లు తాగించిన వైనం.. ఉద్ధవ్ ఠాక్రే వంటి నాయకుడితో పోరాడిన ధీరత్వం.. బాలీవుడ్ నిర్మాతలను ఢీ కొట్టిన శౌర్యం.. ఇవన్నీ కంగనా రనౌత్ సొంతం. ఇన్ని రోజులపాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కీలక కథానాయకగా ఆమె ఒక వెలుగు వెలిగారు. ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి పార్లమెంటు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విక్రమాదిత్య సింగ్ రంగంలో నిలిచారు. ఈ మేరకు విక్రమాదిత్య పేరును హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్ ప్రకటించారు.
ఇప్పటికే విక్రమాదిత్య, కంగనా మాటల యుద్ధం ప్రారంభించారు. అయితే ఇటీవల తన పదవికి విక్రమాదిత్య రాజీనామా ప్రకటించడంతో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడింది. అయితే తన రాజీనామాను ఆయన ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కి ఉపశమనం లభించింది.. మాటల్లో దూకుడు స్వభావాన్ని ప్రదర్శించే నైజం విక్రమాదిత్య సొంతం. పైగా ఈ రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు.. యువతలో ఆయనకు మంచి పట్టు ఉంది. పైగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు.. విక్రమాదిత్య ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి మాస్టర్ డిగ్రీ పొందాడు. 2013లో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2017లో సిమ్లా రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన విక్రమాదిత్యకు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన పట్టు ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే గత ఫిబ్రవరిలో అతడు తన రాజీనామాను ప్రకటించాడు. ఆ సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలో చేరబోతున్నాడనే విమర్శలు వినిపించాయి. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో ఇది నిజమే అనే ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత అధిష్టానం బుజ్జగించడంతో విక్రమాదిత్య రాజీనామాను వెనక్కి తీసుకున్నాడు.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ కు విక్రమాదిత్య కు మొదటినుంచి పడటం లేదు. వాస్తవానికి హిమాచల్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని విక్రమాదిత్య కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరాడు. అయితే అధిష్టానం అతని కోరికను పక్కనపెట్టింది. అప్పటినుంచి ఆయన ఒకింత అసంతృప్తితోనే ఉన్నారు..
ఇక విక్రమాదిత్యను మండి పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా ప్రకటించడంతో కంగనాలో భయం మొదలైందని కాంగ్రెస్ నాయకులంటున్నారు. మండి పార్లమెంటు స్థానంపై తమ పార్టీకి పట్టు ఉందని.. ఈ పార్లమెంటు స్థానానికి సంబంధంలేని సినీనటి కంగనా ను ఇక్కడికి తీసుకొచ్చారని బిజెపి నేతలపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. మండి పార్లమెంట్ స్థానంలో కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని వారు చెబుతున్నారు.. మరోవైపు కంగనా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ఇద్దరూ యువ అభ్యర్థులే కాబట్టి, ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.