Betting Apps
Betting Apps: తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్(Online Betting aaps)పై ఉక్కుపాదం మోపుతూ, పౌరులను ఈ ప్రమాదాల నుంచి కాపాడేందుకు కీలక చర్యలు చేపట్టింది. రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలోని సర్కార్ ఈ బెట్టింగ్ యాప్స్‌ను నిషేధించడమే కాకుండా, వాటి మోసాలను అరికట్టేందుకు జనంలో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో, బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోయిన వారు లేదా అటువంటి యాప్స్ గురించి సమాచారం ఇవ్వాలనుకునే వారు 8712672222 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: సౌత్ ఇండియా సపరేట్ కంట్రీ.. ఉద్యమానికి సిద్ధమన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే..!
133 యాప్స్ బ్లాక్..
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఇప్పటికే 133 భారతీయ బెట్టింగ్ యాప్స్‌ను బ్లాక్ చేసింది. విదేశాల నుంచి నడిచే అన్‌రిజిస్టర్డ్ యాప్స్(Un Registard aaps)ను గుర్తించి నిషేధించే పనిలో ఉంది. జియో–ఫెన్సింగ్ టెక్నాలజీ(Jio Fencing Technology) ద్వారా ఈ యాప్స్‌కు రాష్ట్రంలో యాక్సెస్‌ను నిరోధిస్తున్నారు. రెండు నెలల్లో 42,206 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలను ఈ మోసాల గురించి హెచ్చరిస్తున్నారు. ఈ యాప్స్ వల్ల ఆర్థిక నష్టాలతో పాటు, కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా నమోదయ్యాయి.
గేమింగ్ యాక్ట్ కింద చర్యలు..
తెలంగాణ గేమింగ్ చట్టం, 2017 ప్రకారం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొనడం, ప్రమోట్ చేయడం లేదా సహకరించడం చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలను క్రియాశీలకంగా ఫిర్యాదులు చేయమని కోరుతోంది. 8712672222 నంబర్ ద్వారా ఎవరైనా తమ అనుభవాలను లేదా బెట్టింగ్ యాప్స్ గురించి సమాచారాన్ని పంచుకోవచ్చు. ఈ చర్యలు రాష్ట్రంలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వల్ల కలిగే ఆర్థిక, సామాజిక నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.