CM Revanth Reddy : కేటీఆర్ కంటే ముందే రేవంత్ రెడ్డి పాదయాత్ర.. ముఖ్యమంత్రిగా ఉన్నా ఎందుకిలా?

"మేం కాలేశ్వరం నిర్మించాం.. వేలాది ఎకరాలకు సాగనీరు అందిస్తున్నాం. హైదరాబాదు నగరానికి కూడా తాగునీరు అందించడానికి ప్రయత్నాలు చేసాం. కానీ డబ్బులకు లొంగిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసి నాటకాన్ని తెరపైకి తెస్తోంది." మూసి పునరుజ్జీవం పై భారత రాష్ట్ర సమితి చేస్తున్న ఆరోపణలు ఇవి.

Written By: Anabothula Bhaskar, Updated On : November 8, 2024 8:22 am

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy :  గత కొద్ది రోజులుగా మూసి పునరుజ్జీవం పై ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర అధికారుల నేతృత్వంలో పలువురు పాత్రికేయులు దక్షిణ కొరియాలోని సియోల్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కాలుష్య కాసారంగా ఉన్న సరస్సును అందమైన నదిగా మార్చిన విధానాన్ని చూశారు. అదే పద్ధతిని తెలంగాణలోని మూసీ నది కూడా అన్వయించాలని భావించారు. ప్రభుత్వానికి నివేదిక కూడా స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మూసీ నది ప్రక్షాళన విషయంలో ముందుకే వెళుతున్నట్టు ఇప్పటికే స్పష్టం చేశారు. శుక్రవారం పుట్టినరోజు జరుపుకుంటున్న రేవంత్ రెడ్డి.. మూసీ నది వెంట పాదయాత్ర చేయనున్నారు. దానికి “మూసీ పునరుజ్జీవన సంకల్పయాత్ర”గా పేరు పెట్టారు. ఈ యాత్ర ద్వారా మూసి నది పరివాహకంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రైతులు పడుతున్న కష్టాలను ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకుంటారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది..” కేటీఆర్ పాదయాత్ర చేస్తా అంటున్నారు. కానీ ఆయన కంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటారు. మూసి పరివాహ ప్రాంతాల ప్రజల ఇబ్బందుల పరిష్కారానికి ఆయన చర్యలు తీసుకుంటారని” కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పుట్టినరోజు సందర్భంగా..

శుక్రవారం తన పుట్టిన రోజు కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టలో పూజలు చేస్తారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.. ఆ తర్వాత ఉదయం 11:30 నిమిషాలకు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష జరుపుతారు. అనంతరం మధ్యాహ్నం రోడ్డు మార్గం ద్వారా సంగెం వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత మూసీ నది పునరుజ్జీవ సంకల్పయాత్రను మొదలుపెడతారు. మూసి నదికి కుడి బొడ్డు ప్రాంతంలో ఉన్న భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు యాత్ర చేస్తారు. ఆ తర్వాత ధర్మారెడ్డి పల్లి కెనాల్ కట్ట నుంచి సంగెం – నాగిరెడ్డిపల్లి వరకు పరిశీలన చేస్తారు. అక్కడ ఏర్పాటుచేసిన మూసి పునరుజ్జీవ సంకల్ప రథంపై ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్తారు.

ఇటీవల కాలంలో తాను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ అన్నారు. ఫార్ములా 1 రేస్ వ్యవహారంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిశారు. త్వరలో ఈ వ్యవహారంపై కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు కేటీఆర్ పాదయాత్ర చేస్తానని చెప్పిన నేపథ్యంలో.. దానికంటే ముందుగానే రేవంత్ రెడ్డి మూసీ నది పరివాహకంలో పాదయాత్ర చేయడం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది.