Bandi Sanjay Son Case: తెలంగాణ బీజేపీలో కీలక నేత.. కరుడుగట్టిన హిందుత్వ వాది.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. అదే సమయలో కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో సాయి భగీరథ్ కూడా హనీట్రాప్ కేసు పెట్టారు. ఓ బాలికను అడ్డం పెట్టుకుని ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈమేరకు మైనర్ బాలిక తల్లిదండ్రులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
పొలిటికల్ టర్న్..
రాజకీయ నేతల పిల్లలు చేసే కొన్ని పనులు.. నేతలకు తలనొప్పిగా మారుతున్నాయి. రాజకీయంగా ఇబ్బందులు తెస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయంలో కూడా ఆయన కుమారుడు సాయి భగీరథ్ చేసే పనులు ఇబ్బందిగా మారుతున్నాయి. కష్టపడి సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు సంజయ్ ఎదిగారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మహేంద్ర కాలేజీలో సహచర విద్యార్థిపై దాడి ఘటన సంచలనంగా మారింది. అప్పుడు సంజయ్ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ తనయుడిపై పోక్సో కేసు నమోదు కావడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఇది క్రమంగా రాజకీయం రంగు పులుముకుంది. సంజయ్ ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు కుట్ర చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ నేతలు.. సంజయ్ తనయుడికి సంబంధించిన పాత ఘటనల ఫొటోలతోపాటు తాజా ఘటనల ఫొటోలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సంజయ్ తనయుడి కొడుకు అంటూ సంజయ్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కీలక ప్రకటన చేసిన సంజయ్..
సంజయ్ తనయుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర మంత్రి తాజాగా స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.
‘నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పహలకు అద్దం పడుతుంది’ అని పేర్కొన్నారు.
‘అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్ గా, నేడు ఎంపీగా ఎన్నికై, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి’ అని వెల్లడించారు.
ప్రధాని పర్యటనవేళ కావాలనే..
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తున్నవేళ తన ఇమేజ్ డ్యామేజ్ చేయాలని, తనను అప్రతిష్టపాలు చేయాలని కొందరు కుట్ర చేశారని సంజయ్ ఆరోపించారు. కానీ తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందని తెలిపారు. కాలమే ఆరోపణలకు సమాధానం ఇస్తుందని, కుట్రలను బయట పెడుతుందని స్పష్టం చేశారు.
మొత్తంగా ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రి సంజయ్ తనయుడిపై పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. మోదీ సభకు సంజయ్ వెళ్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.