Balapur laddu : బాలాపూర్ లడ్డూ వేలం.. ఈసారి అత్యధిక ధర దక్కుతుందా? నిబంధనలు ఇలా ఉన్నాయి

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. ఇప్పటికే బండ్లగూడ కీర్తి రిచ్ విల్లాస్ గణపతి లడ్డుకు వేలం నిర్వహించగా 1.87 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 17, 2024 10:17 am

Balapur laddu

Follow us on

Balapur laddu : బండ్లగూడ గణపతి లడ్డుకు మించి బాలాపూర్ లడ్డు ధర పలికే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం ఉదయం 9:30 నుంచి వేలంపాట మొదలైంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం లడ్డు వేలం 15 లక్షల ను దాటిపోయింది. అయితే ఈసారి బాలాపూర్ గణపతి నిర్వాహక కమిటీ బాధ్యులు సరికొత్త నిబంధనలను తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో నిర్వహించే లడ్డువేలంలో గతంలో స్థానికేతరులు పాల్గొనేవారు. వారంతా స్థిరాస్తి వ్యాపారులు కావడంతో లడ్డు ధర విపరీతంగా పెరిగేది.. అయితే ఈసారి స్థానికులకు అవకాశం ఇచ్చారు. అంతేకాదు వేలంలో పాల్గొనేవారు ముందస్తుగా డబ్బు డిపాజిట్ చేయాలని నిబంధన విధించారు. బాలాపూర్ లడ్డు కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రతి ఏడాది నిర్వహించే వేలంలో రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. ఏడాది కాడాది ఈ ధర పెరుగుతూ వస్తోంది. ఈ లడ్డును దక్కించుకుంటే అన్ని లాభాలు జరుగుతాయని నమ్మకం. అందువల్లే ఎన్ని డబ్బులైనా లెక్కచేయకుండా లడ్డూను వేలం లో కొనుగోలు చేస్తారు.

1994లో ప్రారంభం..

బాలాపూర్ లడ్డూ వేలం 1994లో ప్రారంభమైంది. అప్పట్లో గణపతి లడ్డును మోహన్ రెడ్డి అనే వ్యక్తి 450 రూపాయలకు దక్కించుకున్నారు. ఆ లడ్డును సగం కుటుంబ సభ్యులకు పంచి.. మిగతా సగాన్ని తన పొలంలో చల్లుకున్నాడు. దీంతో అతనికి బాగా కలిసి వచ్చింది. అప్పటిదాకా సాధారణ జీవితం గడిపిన అతడు.. ఏడాది తిరిగేసరికి కోటీశ్వరుడిగా మారాడు. ఎందుకంటే బాలాపూర్ ప్రాంతంలో అప్పుడే స్థిరాస్తి వ్యాపారం ప్రారంభం కావడంతో మోహన్ రెడ్డి భూములకు ధర అమాంతం పెరిగింది. ఫలితంగా ఆయన కోట్లకు ఎదిగాడు. 1994లో వందల్లో పలికిన లడ్డు ఇప్పుడు ఏకంగా లక్షలకు చేరింది. గత ఏడాది 27 లక్షలకు దాసరి దయానంద రెడ్డి అనే వ్యక్తి లడ్డును కొనుగోలు చేశాడు. అయితే ఈసారి అది మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి లడ్డువేలం 30 లక్షలు దాటుతుందని స్థానికులు అంటున్నారు. లడ్డుకు ఉన్న డిమాండ్ వల్ల గణపతి ఉత్సవాల నిర్వాహక కమిటీ బాధ్యులు.. ఈసారి కొత్త నిబంధన తీసుకొచ్చారు. బయట వ్యక్తులు వేలంలో పాల్గొనకుండా.. వేలంలో పాల్గొనే స్థానికులు డబ్బు డిపాజిట్ చేసేలా నిబంధన మార్చారు.. అయితే స్థానికులు ప్రస్తుతం పోటాపోటీగా లడ్డు కోసం వేలం పాట పాడుతున్నారు. గత ఏడాది కూడా ఇదే స్థాయిలో లడ్డు కోసం పోటీపడ్డారు. ఫార్మా రంగ నిపుణులు, స్థిరాస్తి వ్యాపారులు లడ్డు కోసం వేలంలో పాల్గొన్నారు. చివరికి దయానంద రెడ్డి అనే స్థిరాస్తి రంగానికి చెందిన వ్యాపారి 27 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.. అయితే ఈసారి అంతకుమించి అనేలాగా ధర పలకవచ్చని అంచనాలున్నాయి.